టీడీపీ ఫ్లెక్సీలపై.. వైసీపీ పోస్టర్లు

ABN , First Publish Date - 2023-03-31T00:06:30+05:30 IST

టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీలపై.. గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ పోస్టర్లు అతికించారు. దీనిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ ఫ్లెక్సీలపై.. వైసీపీ పోస్టర్లు
టెక్కలి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

- తెలుగుతమ్ముళ్ల ఆందోళన

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

- పోలీసులకు ఫిర్యాదు

టెక్కలి, మార్చి 30: టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీలపై.. గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ పోస్టర్లు అతికించారు. దీనిని నిరసిస్తూ.. టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఈ నెల 26న నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ టెక్కలిలోని ప్రధాన మార్గాలు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిపైన బుధవారం అర్ధరాత్రి ‘‘శ్రీరామ నవమి’’ శుభాకాంక్షలు పేరిట సీఎం జగన్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ బొమ్మలతో ఉన్న పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. ఎక్కడికక్కడ అచ్చెన్న ఫ్లెక్సీలపై.. వైసీపీ నేతల పోస్టర్లు కనపడడంతో టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. వైసీపీ నాయకులు శునకానందం పొందుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హనుమంతు రామకృష్ణ, మామిడి రాము, లవకుమార్‌, రెయ్యి ప్రీతీష్‌, కోళ్ల అబ్బాస్‌, జీరు వెంకటరెడ్డి, మళ్ల బాలకృష్ణ, బసవల అప్పలస్వామి, కాళీ బెహరా, మెండ దమయంతి, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాడు శిలాఫలకాలు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో(2019)లో టీడీపీ శిలాఫలకాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ హయాంలో పట్టుమహాదేవి కోనేరు గట్టుపై నిర్మించిన పైలాన్‌, కింజరాపు ఎర్రన్నాయుడు రక్షితనీటి పథకం వద్ద నిర్మించిన శిలాఫలకం, 200 పడకల జిల్లా కేంద్రాసుపత్రి వద్ద ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. తాజాగా అచ్చెన్న ఫ్లెక్సీలపై వైసీపీ స్టిక్కర్లు అతికించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-31T00:06:30+05:30 IST