టీడీపీ పాదయాత్రకు అడ్డంకులు
ABN , First Publish Date - 2023-09-20T00:21:45+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విడుదల చేయాలని కోరుతూ.. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ నుంచి అరసవల్లి ఆదిత్యుడి ఆలయం వరకూ పార్టీ శ్రేణులు తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

- పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
- తాము టెర్రరిస్టులమా? అని మండిపడిన నేతలు
- జగన్‌ను గద్దె దించేవరకు నిద్రపోం
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
అరసవల్లి, సెప్టెంబరు 19: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విడుదల చేయాలని కోరుతూ.. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ నుంచి అరసవల్లి ఆదిత్యుడి ఆలయం వరకూ పార్టీ శ్రేణులు తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్భందించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పాదయాత్రకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 8 గంటలు ఏడురోడ్ల జంక్షన్ వద్దకు చేరుకున్న టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, తదితరులును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ జీఆర్ రాధిక అరసవల్లిలోని స్వామి పెద్దతోట నుంచి ఆదిత్యాలయానికి పాదయాత్ర చేయడానికి అనుమతించారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మాట్లాడుతూ.. ‘40ఏళ్లు మచ్చలేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. జగన్ అక్రమ, అరాచక పాలనకు చరమగీతం పాడి గద్దె దించే వరకు టీడీపీ, జనసేన నిద్రపోయేది లేదు. ప్రతీ విషయానికి అరెస్టు చేయడానికి మేము ఏమైనా టెర్రరిస్టులమా?. సంఘవిద్రోహ శక్తులమా?’ అని ప్రశ్నించారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం మనకు ప్రసాదించిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ఇక కుదరదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక , మైనింగ్, కల్తీ మద్యం ద్వారా దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎంతమాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఇంతటి అక్రమ, అరాచక పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, కోరాడ హరగోపాల్, చిట్టి మోహన్, జంగమసేవాసంఘం జిల్లా అధ్యక్షుడు విభూది సూరిబాబు, సురకాసి వెంకటరావు, బుక్కా యుగంధర్, కవ్వాడి సుశీల, కొమర కమల, గార మండల టీడీపీ అధ్యక్షుడు జల్లు రాజీవ్, ఎస్వీ రమణ మాదిగ, సూరాడ అప్పన్న, మైలపల్లి నరసింగరావు, సీర రమణ, మాడుగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అశోక్ గృహ నిర్బంధం
కవిటి : ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా శ్రీకాకుళంలో నిర్వహించనున్న పాదయాత్రలో అశోక్ పాల్గొనకుండా అడ్డుకున్నారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే స్వగృహం వద్దకు మంగళవారం ఉదయానికే పోలీసులు చేరుకున్నారు. బయటకు వెల్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఇంటి వద్దే ఉండిపోయారు.