మామి‘డీలా’!

ABN , First Publish Date - 2023-06-03T00:38:11+05:30 IST

అకాల వర్షాలు... ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరికి నిరాశ మిగిలింది. మసి, మంగు తెగుళ్లతో నల్లగా మారడంతో పాటు వడగండ్లతో మరింత నష్టం వాటిల్లింది.

మామి‘డీలా’!

బీమా లేదు..పరిహారం రాదు.

పంటపై తెగుళ్ల దాడి

మార్కెట్లో కనిపించని ధర

మామిడి రైతు కుదేలు

(మెళియాపుట్టి)

అంపురం గ్రామానికి చెందిన చందనగిరి పోలయ్యకు రెండెకరాల మామిడి తోట ఉంది. ఈ ఏడాది మామిడి కాయ దశలో ఉన్నప్పుడు వడగళ్ల వర్షం కురవటంతో మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి. మరికొన్ని కాయలు చెట్లలో ఉన్నప్పటికీ మచ్చలు రావడంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని వాపోతున్నాడు.

..........................

బందపల్లి గ్రామానికి చెందిన బి.బాబూరావుకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. ఇటీవల గాలులకు పెద్ద మొత్తంలో కాయలు రాలిపోయాయి. ఇవి అటు మగ్గబెట్టడానికి గానీ... ఇటు పచ్చడికి కానీ పనికి రాని పరిస్థితి. వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాకపోవటంతో తోటలోనే కాయలను వదిలేశాడు.

.............................

అకాల వర్షాలు... ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరికి నిరాశ మిగిలింది. మసి, మంగు తెగుళ్లతో నల్లగా మారడంతో పాటు వడగండ్లతో మరింత నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో ఐదువేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. వీటిలో సుమారు 20 వేల టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారుల అంచనా. రైతుకు తీవ్ర నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. జీడి, మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం బీడీసీఐఎస్‌ఎస్‌(వాతవరణ ఆధారిత భీమా పథకం) కింద నష్ట పరిహారం చెల్లించడం లేదు. ఈ క్రాప్‌ చేస్తున్నా నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎగుమతులు లేక

జిల్లా నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ, కోలంగోవా, కలెక్టర్‌తో పాటు మరో 15 రకాల మామిడికాయల ఎగుమతులు ఉండేవి. ఒడిశాలో గల బరంపురం, కటక్‌, భువనేశ్వర్‌తో పాటు మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు ఎగుమతులు ఉండేవి. గతంలో నాణ్యమైన కాయలు టన్ను రూ.40వేల వరకు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వాటికి రూ.10 వేలకు మించి రావడంలేదు. ఈ మొత్తం కూలీలకు కూడా సరిపోదని రైతులు పెదవి విరుస్తున్నారు.

చుట్టుముట్టిన తెగుళ్లు

గత రెండేళ్లలో కోవిడ్‌ కారణంగా మామిడి దిగుబడి వచ్చినా మార్కెట్‌ లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది మార్కెట్‌ ఉన్నప్పటికీ తొలి నుంచే తెగుళ్లు చుట్టుముట్టాయి. అధిక మొత్తం వెచ్చించి సస్యరక్షణ చర్యలు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. తొలుత తేనేమంచు, బూడిద తెగుళ్లు, ప్రస్తుతం వడగండ్లతో కాయలో పురుగు చేరి కుళ్లిపోతున్నాయి. మచ్చలు రావటంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.

ఆదేశాలు లేవు

జీడి, మామిడి పంటలకు వాతావరణ ఆధారిత బీమా పఽథకం ఉంది. ఈ ఏడాది మామిడి పంటకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం రైతుభరోసా కేంద్రంలో రైతులు ఈ క్రాప్‌ చేయించుకుంటే నష్ట పరిహారం వస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అన్ని నష్టాలు అంచనా వేయగలం.

- శంకరరావు, ఉద్యానవన శాఖ అధికారి, పాతపట్నం సెక్టార్‌

Updated Date - 2023-06-03T00:38:11+05:30 IST