ఒడిశా.. నిషా!
ABN , First Publish Date - 2023-05-26T00:16:43+05:30 IST
జిల్లాలో గంజాయి వాసన గుప్పుమంటోంది. పక్క రాష్ట్రం ఒడిశా నుంచి యథేచ్ఛగా జిల్లాకు అక్రమ రవాణా జరుగుతోంది. ఇక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. యువత, విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. దీనికోసం వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక కోడ్‌తో గంజాయిని సరఫరా చేస్తున్నారు. గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

- గుప్పుమంటున్న గంజాయి
- అక్రమ రవాణాకు అడ్డాగా జిల్లా
- విద్యార్థులు, యువతే టార్గెట్
- మత్తులో నేరాలకు పాల్పడుతున్న వైనం
- పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
(టెక్కలి)
- ఈ ఏడాది మార్చి 12న ఒడిశా నుంచి విజయవాడకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఏడు ప్యాకెట్లలో 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని రైలులో తరలించేక్రమంలో వీరు పట్టుబడ్డారు.
................
- ఈ నెల 20న పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా బ్యాగ్ కింద పడిపోయింది. వారు పట్టించుకోకుండా వెళ్లిపోయేసరికి ఆర్టీసీ సిబ్బంది బ్యాగును కార్యాలయానికి అందించారు. తెరచి చూడగా అందులో 3.5 కిలోల గంజాయి బయటపడింది.
................
- ఈ నెల 21న మందస మండలం అంబుగాం దేవాలయం సమీపంలో పాత జాతీయ రహదారిపై 24 కిలోల గంజాయి పట్టుబడింది. మాటువేసి పట్టుకున్న పోలీసులు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకుల వయసు 20 ఏళ్లు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
................
.. ఇలా నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతోంది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కుతున్న వారిలో ఎక్కువగా యువకులే ఉండడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాకు ఒడిశాతో అనుబంధం ఎక్కువ. ఒడిశా రాష్ట్రానికి మన జిల్లా నుంచి రోడ్డు, రైలు మార్గం ఉంది. ఇదే ఇప్పుడు మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, విక్రయానికి కారణమవుతోంది. ఒడిశాలోని గజపతి, గంజాం, రాయగడ జిల్లాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్లలో కనీస తనిఖీలు లేవు. ఉన్న చెక్‌పోస్టులను సైతం ఎత్తేశారు. ప్రత్యేక పోలీసులను విధుల నుంచి తొలగించారు. దీంతో తనిఖీలు మృగ్యమయ్యాయి. గంజాయి రవాణాదారులు, ముఠాలు ఇష్టారాజ్యంగా జిల్లాలోకి ప్రవేశిస్తు న్నారు. స్థానిక యువతతో ఒప్పందం చేసుకుంటున్నారు. వారితోనే గంజాయిని విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పలాస, పూండి, నౌపడ, కోటబొమ్మాళి, తిలారు, శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, జి.సిగడాం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇందులో పలాస, శ్రీకాకుళం పెద్దస్టేషన్లు. వీటిని మినహాయించి చిన్నస్టేషన్ల మీదుగా గంజాయిని రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాసింజర్ రైళ్ల ద్వారానే గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం.
ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు..
యువకులు, విద్యార్థులే గంజాయి ముఠాకు టార్గెట్. ఇందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు నడుపుతున్నారు. గంజాయి తాగడాన్ని ఒక ఫ్యాషన్‌గా చెప్పుకొని యువతను ఆకర్షిస్తున్నారు. పలానా చోట గంజాయి దొరుకుతుందని కోడ్ సంభాషణను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా 20 సంవత్సరాల్లోపు ఉన్నవారినే పక్కా ప్రణాళికతో గంజాయికి అలవాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో అయిదారుగురు యువకులను ఎంపిక చేసుకొని ముగ్గులోకి దించుతున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడం, నిషా ఎక్కువగా ఇస్తుండడంతో ఇట్టే ఆకర్షితులవుతున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ఇటీవల టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు భారీస్థాయి బోర్డులను విద్యాసంస్థల వద్ద ఏర్పాటు చేశారు. అంతకుమించి చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాను కూడా అడ్డుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసులు చేసిన తనిఖీల్లో మాత్రమే గంజాయి పట్టుబడుతోంది.
మత్తులో నేరాలు..
చాలా గ్రామాల్లో 15 ఏళ్లు కూడాలేని కొంతమంది మైనర్లు గంజాయి తాగుతున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడం.. నిషా ఎక్కువగా ఇస్తుండడంతో వాటిని ఆశ్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలు, అమ్మవారి పండగల్లో పార్టీ కల్చర్ పెరుగుతుండడంతో నిషేధిత మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఈ మత్తులో గొడవలకు, నేరాలకు పాల్పడుతున్నారు. నిండు భవిష్యత్‌ను చేజేతులా దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు కొన్ని ప్రాంతాలు అడ్డాగా నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.
వన్యప్రాణుల వేట..
వన్యప్రాణుల వేటలోనూ యువత, బాలురు చి క్కుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో సుదీర్ఘ మైన వన్యప్రాంతం ఉంది. ముఖ్యంగా తూర్పు కను మల్లో ఎత్తయిన మహేంద్రగిరులు ఉన్నాయి. ఇక్కడ అపారమైన వన్యప్రాణి సంపద ఉంది. ఇప్పుడు వాటిని చేజిక్కించుకునే పనిలో అక్ర మార్కులు ఉన్నారు. అందుకు యువకులు, విద్యార్థులను సమి ధులుగా వాడుకుంటున్నారు. డబ్బులు ఆశచూపి వారిని ముగ్గులోకి దించుతున్నారు. ఆరు నెలల కిం దట పలాసలో వణ్యప్రాణులతో నలుగురు యువకు లు పట్టుబడ్డారు. మందస మండలంలోని మహేంద్ర గిరుల్లో వన్యప్రాణులను వేటాడి.. పలాసలో ఓ లాడ్జిలో విక్రయించే క్రమంలో అటవీశాఖ స్ర్టింగ్ ఆపరేషన్‌కు చిక్కారు. ఈ ఘటనలో నలుగురు యువకులు కటకటలాపాలయ్యారు. అయితే, వీరివెనుక ఉన్నది ఎవరో బయటపడలేదు.
28.24 కేజీల గంజాయి స్వాధీనం
జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని ఒరియా వీధిలో 28.24 కేజీల గంజాయి నిల్వలు పోలీసులకు పట్టుబడ్డాయి. ఏడుగురిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ పారినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీముఖలింగంలోని ఒరియా వీధిలో గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం రాత్రి దాడులు చేయగా.. దుర్గాప్రసాద్ దాస్, పద్మావతి దాస్, రాజకుమారి దాస్‌ల వద్ద హిరమండలం, నరసన్నపేటకు చెందిన పన్నీరు కుషీకుమార్, దిబారిక రోహిత్, గొర్లె సాయిప్రకాష్ గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి 28.24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ రూ.1.50 లక్షలు ఉంటుంది. గంజాయిని ఒడిశాకు చెందిన బృందావతి రౌలో సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు విక్రయించిన ముగ్గురు, కొనుగోలు చేసిన మరో ముగ్గురితోపాటు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి.. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. వారిని నరసన్నపేట మేజిస్ర్టేట్ కోర్టులో గురువారం హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్ విధించారని వివరించారు. .........................
అనర్థాలు అధికం..
గంజాయితో అనర్థాలు అధికం. నిరంతరం తాగితే శరీరంపై అదుపు కోల్పోతాం. అవయవాల పనితీరు తగ్గుముఖం పడతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేం. అదే నేర ప్రవృత్తికి దారితీస్తుంది. అనేక రకాల చర్యలకు పురిగొల్పు తుంది. అందుకే పిల్లల కదలికలపై తల్లిదండ్రులు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి చర్యలను గమనిస్తూ ఉండాలి.
- డాక్టర్ సీపాన శ్రీనుబాబు, వైద్యులు, టెక్కలి
............................
నిఘా పెట్టాం..
జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. రవాణా జరగకుండా సరిహద్దు ప్రాంతాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు వంటి ప్రాంతాలపై దృష్టి సారించాం. ఎక్కడైనా గంజాయి ఆచూకీ తెలిస్తే మాకు సమాచారం అందించాలి.
- అనీల్‌కుమార్, సెబ్ సీఐ, టెక్కలి
...........................
ప్రత్యేక చర్యలు
వణ్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వణ్యప్రాణులు ఎక్కు వగా ఉన్నాయి. వీటిని వేటగాళ్లు వేటాడకుండా ప్రత్యేక దృష్టిసారించాం.
- సోమశేఖర్, రేంజ్ అధికారి, టెక్కలి