జై.. అమరావతి!
ABN , First Publish Date - 2023-04-03T00:42:13+05:30 IST
‘‘అమరావతే ఏకైక రాజధాని. అమరావతిని రాజధానిగా చేస్తేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అమరావతి జేఏసీ సభ్యులు, ప్రతినిధులు, రైతులు పేర్కొన్నారు. అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్రలో భాగంగా ఆదివారం అమరావతి రథంతోపాటు జేఏసీ సభ్యులు, సుమారు 200మందికి పైగా రైతులు అరసవల్లి చేరుకున్నారు.
- ‘రాజధాని’తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
- ‘దోచుకో-పంచుకో-వెళ్లిపో’ అన్నదే వైసీపీ నినాదం
- అమరావతి జేఏసీ నాయకులు
- అరసవల్లిలో రైతుల మొక్కుల చెల్లింపు.. దీక్ష విరమణ
అరసవల్లి, ఏప్రిల్ 2: ‘‘అమరావతే ఏకైక రాజధాని. అమరావతిని రాజధానిగా చేస్తేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అమరావతి జేఏసీ సభ్యులు, ప్రతినిధులు, రైతులు పేర్కొన్నారు. అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్రలో భాగంగా ఆదివారం అమరావతి రథంతోపాటు జేఏసీ సభ్యులు, సుమారు 200మందికి పైగా రైతులు అరసవల్లి చేరుకున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని దీక్ష విరమించారు. జై అమరావతి అంటూ జేజేలు పలికారు. వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదంటూ నినాదాలు చేశారు. జేఏసీ ప్రతినిధులు, సమన్వయకమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అమరావతి రాజధాని కోసం 29,981 మంది రైతులు 33వేల ఎకరాలను ప్రభుత్వానికి త్యాగం చేశాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చట్టంలోని 9.14 అగ్రిమెంట్ జరిగింది. ప్రభుత్వం, భూములిచ్చిన రైతుల ఏకాభిప్రాయంతోనే ఎటువంటి మార్పులు చేర్పులైనా చేయాలని చట్టంలో ఉంది. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపాయి కూడా అప్పు చేయాల్సిన పనిలేదు. 10వేల ఎకరాల మిగులుభూమి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు రూ.2లక్షల కోట్లపైబడి ఉంటుంది. ఇందులో నాలుగో వంతు భూమిని విడతల వారీగా ప్రభుత్వం అమ్మితే రాజధాని అభివృద్ధికి సరిపడా నిధులు సమకూరుతాయి. తద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని పేదలకు ఉపాధి, అభివృద్ధి, నివాసం కోసం 5శాతం భూమి కేటాయించారు. ఆ భూమిని కూడా పక్కగ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు.. కార్యకర్తలకు కేటాయిస్తున్నారు. మిగులు భూమిని లేకుండా చేస్తే అమరావతి అభివృద్ధికి నిధులు ఉండవు. రాజధాని నిర్మాణం ఎప్పటికీ సాధ్యం కాదనే కుట్రపూరిత ఆలోచనలతో ఇటువంటి అనాగరిక పనులకు ప్రభుత్వం పూనుకుంటోంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘దోచుకో..పంచుకో..వెళ్లిపో..’ అనే నినాదంతో పని చేస్తోంది’’ అని విమర్శించారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కాటా అప్పారావు, రాయపాటి శైలజ, మార్త పావని, తాడిపినేని సురేష్, మొవ్వ.శేషగిరిరావు, బండ్ల. సాంబశివరావు, షేక్ అబ్డుల్ సలాం, కామినేని గోవిందమ్మ, గొట్టిపాటి లక్ష్మి, జమ్ముల అన్నపూర్ణమ్మ, సమన్వయ కమిటీ సభ్యులు కొండిపాటి సతీష్‌చంద్ర, ఎర్రంనేని శ్రీధర్, కళ్లం రాజశేఖర్‌రెడ్డి, ఆకుల ఉమామహేశ్వర్రావు, ఆవల రవికిరణ్, జమ్ముల అనిల్, బండ్లమూడి కోటేశ్వర్రావు, జొన్నలగడ్డ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మద్దతు
అమరావతి జేఏసీ నాయకులు, ప్రతినిధులు, రైతులు, సమన్వయకమిటీ సభ్యులకు జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ మద్దతు పలికారు. అమరావతి రథంలో ఉన్న వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని.. రైతులతోపాటు అరసవల్లి ఆలయానికి వెళ్లారు. రైతులకు అవసరమైర సహకారాన్ని, సదుపాయాల్ని సమకూర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతుబిడ్డగా తనకు రైతుల సమస్యలు తెలుసునన్నారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసినందుకు రైతులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తథ్యమని చెప్పారు.
అమరావతి రైతుల త్యాగం వృఽథా కాదు : అచ్చెన్నాయుడు
టెక్కలి: అమరావతి రైతుల త్యాగం వృఽథాగా పోదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం అరసవల్లిలో యాత్ర ముగించిన అనంతరం అమరావతి రైతులు అచ్చెన్న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. వివిధ అంశాలపై అచ్చెన్న వారితో చర్చించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతుల పాదయాత్రకు దారిపొడువునా అడ్డంకులు సృష్టించింది. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అమరావతి రైతులను అనేక రకాలుగా హింసించారు. అయినా రాష్ట్రప్రజల మద్దతు రైతులకు పుష్కలంగా లభించింది. 1200 రోజులకు పైగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటం.. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఉద్యమంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడంలో అమరావతి రైతులదే కీలకపాత్ర’’ అని తెలిపారు. జగన్‌రెడ్డి పరదాల మాటున పర్యటనలు తప్ప.. అమరావతి రైతుల సమస్య పరిష్కారానికి చొరవచూపడంలేదని విమర్శించారు.