‘ఆసరా’ అందేనా?

ABN , First Publish Date - 2023-03-31T00:06:22+05:30 IST

ఆసరా పథకం లబ్ధిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో చాలా మహిళా సంఘాలకు మ్యాపింగ్‌ కాలేదు. మరికొంతమంది మహిళా సంఘాల సభ్యులు వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ‘ఆసరా’ అందుతుందో లేదోనని చాలామంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.

‘ఆసరా’ అందేనా?

- చాలా మహిళా సంఘాలకు మ్యాపింగ్‌ కాని వైనం

- వేలిముద్రలు పడక సభ్యుల ఆందోళన

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఆసరా పథకం లబ్ధిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో చాలా మహిళా సంఘాలకు మ్యాపింగ్‌ కాలేదు. మరికొంతమంది మహిళా సంఘాల సభ్యులు వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ‘ఆసరా’ అందుతుందో లేదోనని చాలామంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 38,792 డ్వాక్రా మహిళా సంఘాల్లో 4,18,354 మంది సభ్యులున్నారు. తాము అధికారంలోకి వస్తే.. 2019 ఏప్రిల్‌ 11 వరకు మహిళా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చింది. ఆ నగదును నాలుగు విడతల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలివిడతగా 2020లో వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మహిళా సంఘాలకు రుణమాఫీ నిధులను జమ చేసింది. 2021లో రెండో విడత నిధులు మంజూరు చేసింది. మూడో విడత తీవ్ర జాప్యం చేసింది. గతేడాది బదులు.. ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలోగా నిధులు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యుల వివరాలను సచివాలయ వ్యవస్థ ద్వారా మ్యాపింగ్‌ చేశారు. అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించారు. కాగా వివరాల సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలామంది పేర్లు మ్యాపింగ్‌ కాలేదు. కొంతమంది మహిళలు పిల్లల చదువు కోసం పట్టణాలకు వెళ్లారు. మరికొందరు ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లగా.. ఆ సమయంలో సిబ్బంది వివరాలు సేకరించడంతో జాబితాలో నమోదు కాలేదు. మెప్మా పరిధిలో ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం పట్టణాల్లో 55 సంఘాలకు వేలిముద్రలు నమోదు కాలేదు. సెర్ప్‌ ఆధ్వర్యంలో పలు సంఘాల్లో మండలానికి కనీసం 20 నుంచి 35 సంఘాలను అనర్హత జాబితాలో ఉంచారు. వయసు మించిందని, అధిక భూములు, ఆధార్‌లో పొరపాట్లు, ఎన్‌పీసీఐ అనుసంధానం, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు, వేలిముద్రలు తీసుకోవడంలో జాప్యం.. ఇలా అనేక కారణాలు చూపడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. గత రెండు దశల్లో వేల సంఖ్యలో మహిళలకు మొండిచేయి చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందని కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులై ఉండి వేలిముద్రలు వేయనివారి పేర్లు తీసుకున్నా.. నిధులు మాత్రం జమ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

జూన్‌లో జమవుతాయి

అధికారికంగా 22 సంఘాలు(పలాసలో 17, శ్రీకాకుళంలో 4, ఇచ్ఛాపురంలో 1) సక్రమంగా లేనట్టు తేలింది. మరికొన్ని సంఘాలకు వేలిముద్రలు పడలేదు. అందుకే గ్రూపు సభ్యుల్లో ఎవరైనా వేలిముద్రలు వేసేయవచ్చు. వీరికోసం మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. ఇప్పుడు ‘ఆసరా’ డబ్బులు జమకాని వారికి జూన్‌లో జమవుతాయి.

- కిరణ్‌కుమార్‌, మెప్మా పీడీ

Updated Date - 2023-03-31T00:06:22+05:30 IST