Share News

వరదొస్తే.. కోతే!

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:01 AM

వంశధార నదికి ఏమాత్రం వరదనీరు పోటెత్తినా ముందుగా నష్టపోయేది ఈ పరివాహక ప్రాంత రైతులే. వర్షాకాలంలో వరదల సీజన్‌ మొదలుకొని ముగిసే వరకు తీరం చెంత ఉన్న సారవంతమైన భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి.

వరదొస్తే.. కోతే!
హిరమండలం మండలం భగీరథపురం వద్ద కోతకు గురైన పంట పొలాలు

- వంశధార నదీ తీరప్రాంత రైతులకు తప్పని నష్టం

- ఏటా ముంపునకు గురవుతున్న పంట పొలాలు

- పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

(హిరమండలం)

వంశధార నదికి ఏమాత్రం వరదనీరు పోటెత్తినా ముందుగా నష్టపోయేది ఈ పరివాహక ప్రాంత రైతులే. వర్షాకాలంలో వరదల సీజన్‌ మొదలుకొని ముగిసే వరకు తీరం చెంత ఉన్న సారవంతమైన భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి. భూములతో పాటు లక్షలాది రూపాయలు విలువ చేసే పండ్ల తోటలు కోతకు గురవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణం కోసం తీరప్రాంత గ్రామాల్లో భూసేకరణ చేశారు. భామిని మండలం నుంచి గార వరకు కరకట్టల నిర్మాణం చేపట్టేందుకు 2018లో రూ.58కోట్లను మంజూరు చేశారు. పనులు ప్రారంభించగా సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి రాగా.. కరకట్టల నిర్మాణ పనులను నిలిపేసింది. ఇప్పటివరకూ వీటికి సంబంధించి నిధులు మంజూరు చేయలేదు. పనుల ప్రస్తావన లేదు. దీంతో వంశధార వరద ఉధృతికి ఏటా వందలాది ఎకరాల పంట భూములు కోతకు గురవుతూనే ఉన్నాయి.

ఇదీ పరిస్థితి

- హిరమండలం మండలంలో భగీరథపురం, అంబావల్లి, అక్కరాపల్లి, గులుమూరు, పిండ్రుబాడ, గొట్ట గ్రామాల్లో సుమరు 100 ఎకరాలు కోతకు గురైంది.

- ఎల్‌.ఎన్‌.పేట మండలంలో మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు, పెద్దకోట, మోదుగువలస, స్కాట్‌పేట, ఎల్‌.ఎన్‌.పేట, బసవరాజుపేట తదితర గ్రామాల్లో 250 ఎకరాలకు పైగా పంట పొలాలు నదిలో కలిసిపోయాయి.

- కొత్తూరు మండలంలో ఆకులతంపర, సిరుసువాడ, పెనుగోటివాబ, మాతల, సిరుసువాడ తదితర గ్రామాల్లో సుమారు 170 ఎకరాలు నదిలో కలిసిపోయాయి.

- భామిని మండలంలో కీసరి, బిల్లుమడ, తాలాడ, కోసలి, బాలేరు తదితర గ్రామాల్లో 135 ఎకరాల వరకు కనుమరుగైంది.

- సరుబుజ్జిలి మండలంలో తెలుగుపెంట, పాతపాడు, అగ్రహారం, చిన్న కాగితాపల్లి, పెద్దసవలాపురం, యరగాం, పురుషోత్తపురం గ్రామంలో సుమారు 150ఎకరాలు నదిలో కలిసిపోయాయి.

- ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లో 40 ఎకరాల వరకు పంట పొలాలు కోతకు గురయ్యాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కరకట్టల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

రక్షణ చర్యలు కొరవడడం వల్లే..

ఏటా వంశధార నదికి వచ్చే వరదలకు ప్రవాహ వేగం పెరగడంతో నది ఒడ్డు కోతకు గురవుతోంది. విలువైన భూములు నదిలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. సత్వరమే కరకట్టల నిర్మాణం చేపట్టి తీరప్రాంతాల్లో పొలాలకు రక్షణ కల్పించాలి.

- గోళ్ళ సింహాచలం, మాజీ సర్పంచ్‌

...............

కళ్ల ముందే కొట్టుకుపోతున్నాయి

వర్షాకాలం వచ్చిందంటే వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది ఒడ్డు కళ్లముందే వరద ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఆరేళ్లలో పలు ప్రదేశాల్లో 20 అడుగులకు పైగా పంట పొలాలు నదిలో కలిసిపోయాయి. తక్షణమే నది ఒడ్డు కోత నివారణకు చర్యలు చేపట్టాలి.

- చెట్టు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌

Updated Date - Dec 29 , 2023 | 12:01 AM