వరదొస్తే.. వణుకే!

ABN , First Publish Date - 2023-09-22T00:09:21+05:30 IST

వంశధారకు వరదొస్తే చాలు.. నదీ తీర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది. నదిలో నీటిమట్టం పెరిగితే.. వారి గుండెల్లో గుబులు రేగుతుంది. ఒడిశాలోని వంశధార క్యాచ్‌మెంట్‌ ప్రాంతాలైన మోహన, గుణుపూర్‌ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిస్తే.. వరదనీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.

వరదొస్తే.. వణుకే!
గెడ్డవానిపేట వద్ద వంశధార ఉధృతికి కోతకు గురైన సీసీ రోడ్డు

కరకట్టల నిర్మాణాన్ని పట్టించుకోని ప్రభుత్వం

కోతకు గురవుతున్న వంశధార నదీ తీరం

టీడీపీ హయాంలో ప్రారంభమైన పనులు

వైసీపీ వచ్చాక గాలికొదిలేసిన వైనం

ఆందోళనలో తీరప్రాంత వాసులు

(నరసన్నపేట)

గతేడాది సెప్టెంబరులో వంశధార నదికి వరదనీరు పోటెత్తడంతో నరసన్నపేట మండలం గెడ్డవానిపేట గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డు కోతకు గురైంది. అప్పట్లో గ్రామం చుట్టూ వరద చుట్టేసింది. వంశధారకు ఎప్పుడు వరద ఉధృతి పెరిగినా ఇదే పరిస్థితి. అయినా ఇప్పటివరకు కరకట్టలు నిర్మించకపోవడం గమనార్హం.

................

ఇటీవల ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు.. వంశధార నది ఉప్పొంగింది. నదిలోని 72వేల క్యూసెక్కుల వరదనీటిని అధికారులు విడిచిపెట్టడంతో తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. రహదారిపై వరదనీటి ప్రవాహంతో ఇబ్బందులు పడ్డారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. ఇలా ఎన్నాళ్లు జీవనం సాగించాలని నదీ తీర ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కరకట్టల నిర్మాణం హామీలకే పరిమితమవుతోందని వాపోతున్నారు.

-----------

వంశధారకు వరదొస్తే చాలు.. నదీ తీర ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది. నదిలో నీటిమట్టం పెరిగితే.. వారి గుండెల్లో గుబులు రేగుతుంది. ఒడిశాలోని వంశధార క్యాచ్‌మెంట్‌ ప్రాంతాలైన మోహన, గుణుపూర్‌ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిస్తే.. వరదనీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నదీ తీర ప్రాంత గ్రామాలకు ఏటా భారీ నష్టం వాటిల్లుతోంది. ఓ వైపు రహదారులు కోతకు గురికాగా.. మరోవైపు వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోతున్నాయి. కొత్తూరు మండలంలో 14, హిరమండలంలో 10, ఎల్‌ఎన్‌పేటలో 2, సరుబుజ్జిలిలో 4, ఆమదాలవలసలో 5, శ్రీకాకుళం రూరల్‌లో 3, గారలో 4, జలుమూరులో 19, నరసన్నపేట, పోలాకి మండలాల్లో చెరో 12 గ్రామాల ప్రజలు తుఫాన్‌లు, వరద ఉధృతి సమయంలో ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కేవలం నరసన్నపేట నియోజకవర్గంలో శ్రీముఖలింగం, నగిరికటకం, అచ్చుతాపురం, కోమనాపల్లి, సురవరం, దొంపాక, తిమడాం, గంగాధరపేట, చెట్టువానిపేట, అంధవరం, పర్లాం, మాకివలస ,చోడవరం, గెడ్డవానిపేట, వెంకటాపురం, కామేశ్వరిపేట, లుకలాం, చేనులవలస, అంబాజీపేట, బుచ్చిపేట, మడపాం, పోతయ్యవలస, గోపాలపెంట, డోల, పల్లిపేట, వనితమండలం, గోవిందపురం గ్రామాల్లో ఏటా సుమారు 15వేల ఎకరాల వరకు వరి పంటలు నాశనమవుతున్నాయని ఆయా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

వరద ముప్పు నుంచి కాపాడేందుకు 2018లో టీడీపీ హయాంలో వంశధార నదికి రెండువైపులా కరకట్టల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం నాలుగు ప్యాకేజీల కింద పనులను విభజించి రూ.1,056 కోట్ల నిధులు మంజూరు చేసింది. భామిని, హిరమండలం, కొత్తూరు మండలాల్లో మొదటి ప్యాకేజీ కింద రూ.370 కోట్లతో పనులు చేసేందుకు టెండర్లు పిలిచారు. రెండు, మూడు ప్యాకేజీల కింద రూ.620 కోట్లుతో ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో వంశధార కుడికాలువ గట్టు పనులు చేపట్టాలని నిర్ణయించారు. మిగతా నిధులతో నాలుగో ప్యాకేజీ కింద జలుమూరు, నరసన్నపేట, పోలాకి మండలాల్లో ఎడమకాలువ గట్టుపై పనులు చేసేందుకు టెండర్లు పిలిచారు. 2018 జూలైలో ఒప్పందం కుదిరింది. నాలుగు ప్యాకేజీల్లో టీడీపీ హాయంలో 10శాతం పనులు చేపట్టారు. ఈలోగా ఎన్నికలు రాగా.. వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు పడకేశాయి.

- నిధులు లేక నిలిచిన పనులు

జిల్లాలో కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాలు వంశఽధార కుడివైపున ఉన్నాయి. జలుమూరు, నరసన్నపేట, హిరమండలం, పోలాకి మండలాలు ఎడుమగట్టువైపు ఉన్నాయి. జలుమూరు మండలం కరకవలస నుంచి పోలాకి మండలం పల్లిపేట వరకు వరదనీరు గ్రామాలకు చేరకుండా గ్రోయిన్లు, రక్షణ గోడలను పలు గ్రామాల్లో నిర్మించారు. వంశధారకు వచ్చిన వరదలకు గెడ్డవానిపేట వద్ద వేసిన గ్రోయిన్లు కొట్టుకుపోయాయి. శ్రీముఖలింగం నుంచి అచ్చుతాపురం వరకు కరకట్టల పనులు చేపట్టారు. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను మధ్యలో నిలిపేశారు. కరకట్టల నిర్మాణంపై ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇస్తున్నారు తప్ప.. అమలు చేయడం లేదని నదీ తీరప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కరకట్టలు నిర్మించాలని కోరుతున్నారు.

................

బాధలు తప్పడం లేదు

వంశధారకు వరద వస్తే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. తాత, ముత్తాతల నుంచి ఇక్కడే నివసిస్తున్నా.. ఏటా ముంపు బాధలు తప్పడం లేదు. గతేడాది వరద ఉధృతికి ఏటి గట్టు కొట్టుకుపోయింది. పంటలు నష్టపోయాం.

- ముద్దాడ శ్యామలరావు, గెడ్డవానిపేట, నరసన్నపేట

........................

హామీ ఏమైంది

వంశధార నదికి కరకట్టలు నిర్మించి రైతులను ఆదుకుంటామన్న నేతలు హామీలు అమలుకావడం లేదు. రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నా.. కరకట్టలు నిర్మించకపోవడం బాధాకరం.

- అడపా చంద్రశేఖర్‌, ల్యాండ్‌ లార్డు, చోడవరం

..................

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలో భామిని మండలం నుంచి కళింగపట్నం వరకు వంశధారకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి 2018లో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఆదేశాలు మేరకు పనులు చేపడుతున్నాం. గ్రామాల్లో వరదనీరు రాకుండా పనులు చేసేందుకు రూ.118 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపాం.

- వి. బాబ్జీ, డీఈఈ, ఇరిగేషన్‌

Updated Date - 2023-09-22T00:09:21+05:30 IST