ఒక్కరితో బోధన ఎలా?
ABN , First Publish Date - 2023-09-22T23:52:49+05:30 IST
ప్రభుత్వ విధానపరమైన లోపాల కారణంగా విద్యావ్యవస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తామని చెబుతూ పాలకులు కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. అవి పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడకపోగా మరింత నిర్వీర్యమైపోతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు.
- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రశ్నార్థకం
- బోధనేతర పనులే అధికం
- చదువుకు దూరమవుతున్న విద్యార్థులు
(ఇచ్ఛాపురం రూరల్)
ప్రభుత్వ విధానపరమైన లోపాల కారణంగా విద్యావ్యవస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తామని చెబుతూ పాలకులు కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. అవి పాఠశాలల బలోపేతానికి ఉపయోగపడకపోగా మరింత నిర్వీర్యమైపోతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకు పెరుగుతున్న ఏకోపాధ్యాయ పాఠశాలలే తార్కాణం. గతంతో పోల్చుకుంటే ప్రతి మండలంలో పదుల సంఖ్యలో ఏకోపాఽధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎప్పుడు మూతపడతాయో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 662 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అందులో 7,678 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మండలానికి రెండు, మూడు ఏకోపాఽధ్యాయ పాఠశాలలు ఉండగా.. ప్రస్తుతం ఒక్కో మండలంలో 15 నుంచి 20 పాఠశాలలు ఉన్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో చాలామంది అక్కడకు వెళ్లిపోయారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మారిన విధానం ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగిపోయాయి. చాలా మండలాల్లో నలుగురైదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ మూసివేత దిశగా సాగుతున్నాయి.
బోధనకు సమయమేదీ..? :
ఈ బడుల్లో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు బోధనేతర పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో బోధనకు దూరం అవుతున్నారు. విలీనం చేసిన పాఠశాలలే కాకుండా విలీనం చేయని ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఏకోపాధ్యాయులు ఉన్నారు. ఇలాంటి చోట్ల ఐదు తరగతులకు ఒక్కరే బోధించాల్సి వస్తుంది. 1, 2 తరగతులకు మూడు సబ్జెక్టులు చొప్పున మొత్తం ఆరు, 3, 4, 5 తరగతులకు నాలుగు చొప్పున మొత్తం 12 సబ్జెక్టులు, అన్ని తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఐదు గంటల వ్యవధిలో ఒక్క ఉపాధ్యాయుడు వాటిని ఎలా బోధించగలరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ కేటాయించిన బోధనేతర పనులకే సమయం సరిపోతుంటే ఇంకా విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం ఎక్కడ అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంఈవో కురమాన అప్పారావును వివరణ కోరగా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ముందుగానే చెప్పాలని ఆదేశించామన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అక్కడికి సీఆర్‌పీని పంపిస్తున్నామని తెలిపారు.
పట్టించుకోవడం లేదు :
ఒక ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు 18 సబ్జెక్టులను బోధించడం అశాస్త్రీయం. ఈ విషయాన్ని ఎప్పటినుంచో సంఘ పరంగా ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలలతో మెరుగైన విద్యా ప్రమాణాలు సాధించడం దాదాపు అసాధ్యమే. ప్రతి బడికి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. రోజూ వివిధ రకాల యాప్‌ల ద్వారా ఉపాధ్యాయులతో బోధనేతర పనులను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.
- ఆర్‌వీ.అనంతాచార్యులు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు
.................
జీవో 117 రద్దు చేయాలి
జీవో 117 ప్రాథమిక పాఠశాలల మనుగడకు గొడ్డలిపెట్టు లాంటిది. దీని వలన అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. దీనిని రద్దు చేయాలని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకూ ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలి.
- బి.శంకరం, ఆపస్ మండల అధ్యక్షుడు, ఇచ్ఛాపురం