హిరమండలం.. ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-01-26T00:31:08+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. అందుకు కారకులైన వారిని అరెస్ట్‌ చేసి.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 400 మంది గిరిజనులు హిరమండలం వద్ద అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై బుధవారం ఆందోళనకు దిగారు.

హిరమండలం.. ఉద్రిక్తం
హిరమండలం పోలీసుస్టేషన్‌ వద్ద బైఠాయించిన గిరిజనులు

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి

పోలీస్‌స్టేషన్‌ ఎదుట.. గిరిజనుల ధర్నా

అలికాం-బత్తిలి రోడ్డుపై బైఠాయింపు

మూడు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్‌

సీఐ హామీతో విరమణ

హిరమండలం, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. అందుకు కారకులైన వారిని అరెస్ట్‌ చేసి.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 400 మంది గిరిజనులు హిరమండలం వద్ద అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై బుధవారం ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. దీంతో రోడ్డుకిరువైపులా 3 గంటలపాటు బస్సులు, ఇతరత్రా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హిరమండలం మండలం కొండరాగోలు సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెదగూడ పంచాయతీ లంగగుడ్డికి చెందిన సవర కురమయ్య (47) ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పెద్దరాజపురం గ్రామానికి చెందిన సవర జోగారావు (36) శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో వ్యక్తి రిమ్స్‌లో చికిత్సపొందుతున్నాడు. ఈ ముగ్గురూ ఫాస్టర్లుగా పనిచేస్తున్నారు. పాతపట్నం మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఒకే బైక్‌ వస్తుండగా ఘటన జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తుండగా.. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకుపోయిందని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దగూడ పంచాయతీ పరిధిలోని 400 మంది గిరిజనులు హిరమండలం పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అలికాం-బత్తిలి రహదారికి అడ్డంగా విద్యుత్‌ స్తంభాలు వేశారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అటు కొత్తూరు, ఇటు శ్రీకాకుళం వెళ్లాల్సిన బస్సులు మూడు గంటలపాటు నిలిచిపోయాయి. ఎస్‌ఐ నారాయణస్వామి నచ్చజెప్పినా వారు వినలేదు. దీంతో సమాచారమందుకున్న కొత్తూరు సీఐ వేణుగోపాల్‌ హుటాహుటిన హిరమండలం చేరుకున్నారు. గిరిజనులతో చర్చించారు. అయితే పొలంలో దూసుకుపోయిన ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని.. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే స్టేషన్‌కు తీసుకురావాలని కోరారు. పెద్దలు కొంతమంది వస్తే సానుకూలంగా చర్చించి పరిష్కరిద్దామని సీఐ కోరినా వారు వినలేదు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆందోళన కొనసాగించారు. మీకు అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించారు. దీంతో ట్రాఫిక్‌ను క్లియరెన్స్‌ చేశారు. సాయంత్రం గిరిజన సంఘ ప్రతినిధులతో పోలీసులు చర్చించడంతో.. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

Updated Date - 2023-01-26T00:31:08+05:30 IST