మంత్రి అనుచరులా.. మజాకా!

ABN , First Publish Date - 2023-06-03T00:43:31+05:30 IST

వారంతా అధికారపార్టీ అనుచరులు. మంత్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకొనేవారు. అధికారం అండతో.. రెవెన్యూ సిబ్బంది సహకారంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు.

మంత్రి అనుచరులా.. మజాకా!
శ్రీకాకుళం - ఆమదాలవలస రోడ్డు పక్కన చదును చేసిన గెడ్డపోరంబోకు స్థలం

- శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డులో ప్రభుత్వ స్థలం కబ్జా

- సర్వేనెంబర్లు మార్చేసి చదును

- ఆదివారంపేట సమీపంలోనూ మిర్తిబట్టి ఆక్రమణ

- పట్టించుకోని రెవెన్యూ అధికారులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

వారంతా అధికారపార్టీ అనుచరులు. మంత్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకొనేవారు. అధికారం అండతో.. రెవెన్యూ సిబ్బంది సహకారంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు. ఓవైపు శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని చదును చేశారు. గెడ్డపోరంబోకు భూమికి సర్వేనెంబర్లు మార్చేశారు. మరోవైపు శ్రీకాకుళం నగరం ఆదివారం పేట సమీపంలో ఏకంగా సాగునీటి కాలువను ఆక్రమించేశారు. ఆపై 30 అడుగుల రోడ్డు వేసేశారు. నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడడం చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులపై కనీస చర్యలకు ఉపక్రమించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

- ఇన్నాళ్లూ ప్రభుత్వానిది... ఇప్పుడేమో వారిదంట

శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వైపు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాలు అత్యంత విలువైనవి. నగరం ఎక్కువగా ఆమదాలవలస వైపు ఫ్లైఓవర్‌ నుంచి రాగోలు వరకు విస్తరిస్తోంది. భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. ఇక్కడ దుకాణాల అద్దెలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు పక్కనే నాగావళి నదికి ఆనుకుని ఏళ్ల తరబడి చెత్తాచెదారంతో నిండిన గెడ్డపోరంబోకు స్థలంపై అధికారపార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కన్నేశారు. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రణాళిక రచించారు. ప్రొక్లయినర్లతో కావాల్సినంత స్థలాన్ని చదును చేసేశారు. ఎవరైనా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో.. ముందుగానే రెవెన్యూ అధికారుల సహకారంతో నచ్చిన సర్వే నెంబర్లు చెప్పేసి తమ స్థలమని నమ్మబలుకుతున్నారు. ఈ గెడ్డపోరంబోకు స్థలం ప్రభుత్వానిదని.. ఇప్పుడెలా జిరాయితీగా మారిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ నేత అండ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో దర్జాగా కబ్జా చేసేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మంత్రి అనుచరులు కావడంతో భూమిని రికార్డుల్లో పేర్లు మార్పు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రూ.కోట్లు విలువ చేసే ఈ భూమి కబ్జాపై దృష్టి సారిస్తే అక్రమాలు బయటకు వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చితే శ్రీకాకుళంలో కబ్జాలు లేవు. ఎన్నికల సీజన్‌ సమీపిస్తుండడంతో అనుచరులు చేస్తున్న ఉదంతాలపై అమాత్యులు కూడా కన్నేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.

- దర్జాగా రోడ్డు వేసేసి...

శ్రీకాకుళం నగరంలో ఆదివారం పేట నుంచి కాస్త దూరం వెళ్తే.. అక్కడ ఓ ఇద్దరి అధికారపార్టీ నాయకులు చేసిన రియల్‌ దందా బహిర్గతమవుతోంది. ఎటువంటి అనుమతలు లేకుండానే సర్వే నంబర్‌ 46/7లో రియల్‌ వెంచర్‌ వేసేశారు. ఇన్నాళ్లూ వీరిద్దరూ అమాత్యుల అనుచరులమంటూ చెప్పుకుని.. అందరి మెప్పుపొందేందుకు నానాతంటాలు పడుతుండేవారు. ఇప్పుడు తమకూ అవకాశం వచ్చిందని భావించి సాగునీటి వనరైన మిర్తిబట్టిని కప్పేసి.. కల్వర్టును ఏర్పాటు చేసేశారు. దానిపై ఏకంగా 30 అడుగుల రోడ్డును వేసేశారు. ఈ విషయంలో అధికారులను కూడా సంప్రదించలేదని సమాచారం. నిబంధనల ప్రకారం వెంచర్‌లు వేయాలంటే సుడా, ఉడా అనుమతులు తప్పనిసరి. ఇందుకోసం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. ఇవేవీ లేకుండానే విద్యుత్‌ సౌకర్యం కల్పించుకుని.. స్తంభాలు అమర్చి వెంచర్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. సామాన్యులకు రెవెన్యూ పని ఏదైనా ఉంటే వివిధ కొర్రీలు వేసే అధికారులు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు. మంత్రి అనుచరులు కావడంతో వ్యవహారం పూర్తయితే తమకు ఎంతోకొంత మామూళ్లు వస్తాయనే ఉద్దేశంతో.. అధికారులు చూసీచూడనట్టు వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో మంత్రి అనుచరులా మజాకా అన్నరీతిన ఆక్రమణలు సాగుతున్నాయి. రెండుచోట్ల విలువైన భూమి వారి హస్తగతమైంది. సాగునీటి వనరు కబ్జా విషయంలో కనీసం నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కూడా అనుమతులు లేవు. ఏఒక్క అధికారి కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరినట్లు సమాచారం. ఇప్పటికైనా నగరంలో భూ ఆక్రమణలు.. చేజారుతున్న ప్రభుత్వస్థలాలపై కలెక్టర్‌ దర్యాప్తు చేసి అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2023-06-03T00:43:31+05:30 IST