దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..

ABN , First Publish Date - 2023-07-08T00:16:57+05:30 IST

వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. కారులో దైవ దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
కల్వర్టును ఢీకొన్న కారు.

పలాసరూరల్‌, జూలై 7: వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. కారులో దైవ దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన కొండూరు వెంకటేష్‌ (65), రజిత (55), కృష్ణ సముద్రాల, పద్మ సముద్రాల, పైల దానయ్య, విజయ ఒడిశా రాష్ట్రంలోని పూరీ, కోణార్క్‌ పుణ్యక్షేత్రాల దర్శనానికి కారులో వెళ్లారు. దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా రామకృష్ణాపురం వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో రజిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని నేషనల్‌ హైవే అంబులెన్స్‌, 108 వాహనం ద్వారా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్‌ మృతి చెందాడు. మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగమే కారణమా?

ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. రామకృష్ణాపురం జంక్షన్‌ ఉన్న మలుపు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. వాహనాలు వేగంగా వచ్చే సమయంలో ఈ మలుపు వద్ద అప్రమత్తంగా లేకుంటే ప్రమాదానికి గురికాకతప్పదు. ఈ ప్రాంతంలో గతంలో పలు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఈ మలుపు వద్ద కారులో అతివేగంగా రావడం వల్లే వాహనంపై నియంత్రణ కోల్పోయి కల్వర్టును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా హైవే అధికారులు, పోలీసులు ఈ జంక్షన్‌లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - 2023-07-08T00:16:57+05:30 IST