గణేషా... గోతులు చూడయ్యా!

ABN , First Publish Date - 2023-09-18T00:23:06+05:30 IST

జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలమయంగా మారి వర్షం కురిస్తే చాలు.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు.

గణేషా... గోతులు చూడయ్యా!
ఇచ్ఛాపురం రూరల్‌ : కేదారిపురం రోడ్డులోని గుంతలు

- జిల్లాలో అధ్వానంగా రహదారులు

- చవితి వేడుకల్లో అప్రమత్తం అవసరం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఓ బొజ్జ గణపయ్యా.. వినాయకచవితి ఉత్సవాల వేళ.. భూలోకంలో ఉన్న మమ్మల్ని దీవించేందుకు, ఉండ్రాలను ఆరగించేందుకు మా జిల్లాకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా అడుగులు వేయాలి సుమా. జిల్లాలో ఏ రోడ్డు చూసినా గుంతలమయమే. ఎక్కడ చూసినా అధ్వానమే. చిన్నపాటి వర్షం కురిసినా చాలు.. రహదారిపై గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి ఇప్పటికి చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. అందుకే మీరు మా భూలోకానికి మూషిక వాహనంపై వచ్చినప్పుడు ఆచితూచి అడుగేయాలి. మేము ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలి. ఈ రోడ్లను బాగు చేసేలా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఉపదేశం చేయాలి. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా మమ్మల్ని ఆశీర్వదించాలి.

- భక్తుల విజ్ఞప్తి

...............

జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలమయంగా మారి వర్షం కురిస్తే చాలు.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ రోడ్లను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విఘ్నాలు తొలగించే అధిపతి.. వినాయకుడైనా తమ సమస్యలు తొలగిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘గణేశా.. గోతులు చూడయ్యా.. మా కోర్కెలతో పాటు రోడ్లను బాగుచేయించేలా పాలకులకు సద్బుద్ధి ప్రసాదించు అయ్యా’ అని వేడుకుంటున్నారు.

- ఇచ్ఛాపురం రూరల్‌: ఇచ్ఛాపురం మండంలోని కేదారిపురం, బాలకృష్ణాపురం, మునిభద్ర, బలరాంపురం రోడ్లు పెద్దపెద్ద గోతులతో అధ్వా న్నంగా మారాయి. కేదారిపురం రోడ్డులో నిత్యం ఒడిశా నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగి స్తుండడంతో గుంతలు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిత్యం ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయి.

- వజ్రపుకొత్తూరు: రహదారి విస్తరణలో భాగంగా అక్కు పల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాళ్లు వేసి వదిలివేయడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల చినవంకకు చెందిన మదనాల రామ్మూర్తి ద్విచక్రవాహనం వెళ్తుండగా బోల్తా పడి గాయాల పాలయ్యాడు.

- టెక్కలి: గ్రానైట్‌ క్వారీలకు సంబంధించి వేస్ట్‌మెటీరియల్‌ను మూలపేట పోర్టుకు తరలిస్తుండడంతో నౌపడా-మెళియాపుట్టి రోడ్డులో భారీగా గోతులు ఏర్పడ్డాయి. వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

- పొందూరు: లుట్టపేట, యాగాటిపేట గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. లైదాం రైల్వేగేటు అప్రోచ్‌రోడ్డు నుంచి యాగాటి మీదుగా లుట్టపేట వెళ్లే రహదారిలో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ రహదారి గుండా రైల్వేకు అవసరమైన 40 ఎంఎం చిప్ప్‌ తీసుకు వెళ్లే వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. దీంతో భారీ గోతులు ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

- ఎల్‌.ఎన్‌.పేట: అలికాం-బత్తిలిరోడ్డుకు అనుసరించి లక్ష్మినర్సుపేట జంక్షన్‌ నుంచి బొత్తాడసింగి గ్రామానికి వెళ్లే రోడ్డు పెద్దపెద్ద గోతులుగా ఏర్పడి రాళ్లు తేలిపోయాయి. పాక్స్‌దొరపేట, జాడుపేట, బొత్తాడసింగి వయా సరడాం గ్రామాలతోపాటు కొండశివారు గిరిజన గ్రామాల ప్రజలు ఈ రోడ్డుగుండా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముంగెన్నపాడు రోడ్డు కూడా గోతులమయమైంది.

- లావేరు: బెజ్జిపురం గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు గుంత లమయంగా తయారైంది. బొంతుపేట- మెట్టవలస రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. గోతుల్లో వర్షపు నీరు చేరడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

- కంచిలి: కంచిలిలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన చిన్నపాటి వర్షానికే రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రధాన రహదారిపై నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అర్జునాపురం రోడ్డులో గోతులు ఏర్పడ్డాయి.

- పోలాకి: పిన్నింటిపేట, కోడూరు, చిన్నకోడూరు, బెలమరకూడలి, గొల్లలవలస, తలసముద్రం, దీర్గాశి, ఉరజాం, వెళ్లు రహదారులు చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. తోటాడ రహదారిపై కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది.

- నందిగాం: పెంటూరు, పొల్లాడ వయా శివరాంపురం బీటీ రహ దారి గోతులమయం కావడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నా రు. నరేంద్రపురం జంక్షన్‌ నుంచి వల్లభరాయుడుపేట రహదారి, నౌగాం నుంచి హీరాపురం వయా మదనాపురం రోడ్డు అధ్వానంగా ఉంది. నందిగాం జాతీయ రహదారి నుంచి పాలవలస, బడబంద-బంజీరుపేట తదితర గ్రామీణ రహదారులు గోతులమయంగా దర్శనమిస్తున్నాయి.

- హిరమండలం: కొత్తూరు మండలం ఆకులతంపర నుంచి నివగాం వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారి పొడవునా.. పెద్దపెద్ద గుంతలే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు తప్ప.. ఆటోలు, బస్సులు, కార్లు ఈ రహదారి మీదుగా తిరగడం మానేశాయి.

- సరుబుజ్జిలి: అలికాం-బత్తిలి ప్రధాన రహదారి అధ్వా నంగా ఉంది. ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకుని నాలు గేళ్లలో సుమారు 15 మంది వాహనదారులు మృతిచెందారు. పాలకొండ-కొమనాపల్లి, మదనాపల్లి ప్రధాన రహదారుల్లో భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయి.

Updated Date - 2023-09-18T00:23:06+05:30 IST