మత్స్యసంపద వర్షార్పణం

ABN , First Publish Date - 2023-03-20T00:13:42+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు మత్స్యకారులను నట్టేట ముంచాయి. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మత్స్య సంపద తీవ్రంగా దెబ్బతింది. తీరంలో ఎండబెట్టిన చేపలు తడిసిపోవడంతో రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లింది.

మత్స్యసంపద వర్షార్పణం
అకాల వర్షానికి జీరుపాలెం తీరంలో తడిచి పాడైన నెత్తళ్లు

- అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ఎండు చేపలు

- రూ.80 లక్షల నష్టం

- లబోదిబోమంటున్న మత్స్యకారులు

- ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

(రణస్థలం)

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు మత్స్యకారులను నట్టేట ముంచాయి. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మత్స్య సంపద తీవ్రంగా దెబ్బతింది. తీరంలో ఎండబెట్టిన చేపలు తడిసిపోవడంతో రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో రణస్థలం, ఎచ్చెర్ల, గార, కవిటి తదితర మండలాల్లో పదుల సంఖ్యలో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. చేపల వేటే వీరికి జీవనాధారం. ఏటా ఈ సీజన్‌లో చిన్న చిన్న చేపలు(నెత్తళ్లు) వీరి వలకు చిక్కుతుంటాయి. వీటిని ఎండ బెట్టేందుకు తీరంలో ప్లాట్‌ఫాంలు లేకపోవడంతో ఇసుక తిన్నెలపైనే ఆరబెట్టారు. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా అన్ని మత్స్యకార గ్రామాల్లో రూ.80 లక్షల విలువ చేసే నెత్తళ్లను అరబెట్టారు. గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నెత్తళ్లు తడిసిపోయి కుళ్లిపోయాయి. పలుచోట్ల వరదకు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లింది. మరోపక్క వర్షాలు, ఈదురుగాలులతో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో మత్స్యకారులు ఇంటి వద్దే ఉండడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు.

కానరాని కోల్డ్‌ స్టోరేజీలు, జెట్టీలు

జిల్లాలో 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉన్నా అందుకు తగ్గట్టు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఒడిశా, తమిళనాడులో చేపల వేటకు సంబంధించిన అన్నిరకాల సామగ్రిని అక్కడి ప్రభుత్వాలు మత్స్యకారులకు అందిస్తున్నాయి. కానీ, ఇక్కడ మాత్రం వైసీపీ సర్కారు కేవలం మత్స్యకార భరోసా సాయంతో చేతులు దులుపుకుంటోంది. హార్బర్లు, జెట్టీలు వంటివి ఏర్పాటు చేస్తామన్న ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. కనీసం కోల్డ్‌ స్టోరేజీలు కూడా లేవు. తమిళనాడులో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక మినీ జట్టీ ఉంటుంది. ఇక్కడ మాత్రం వందల కిలోమీటర్ల దూరంలో కానీ ఉండని పరిస్థితి. ఒడిశా ప్రభుత్వం అక్కడి మత్స్యకారులకు ఎండుచేపల యంత్రాలను రాయితీపై అందిస్తోంది. ఆ యంత్రాల్లో పచ్చి చేపలను వేసిన అరగంటకే ఎండు చేపలుగా మారుతాయి. అటు రవాణా, మార్కెటింగ్‌ సదుపాయాలను సైతం అక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఈ యంత్రాలను అందించేందుకు కార్యచరణ రూపొందించింది. కానీ, ఇంతలో ఎన్నికలు రావడంతో ఈ నిర్ణయం మరుగునపడిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో హార్బర్లు, జెట్టీలు, మినీ కోల్డ్‌ స్టోరేజీలు, ఫ్లాట్‌పాంలు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

మత్స్యకారుల బాధలు పట్టడం లేదు

మత్స్యకారుల బాధలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. మత్స్యకారులకు కనీస సౌకర్యాలు లేవు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. వేటాడిన చేపలను ఆరబెట్టేందుకు సరైన ప్లాట్‌ఫాంలు లేవు. మత్స్య సంపదను ఎగుమతి చేసేందుకు సదుపాయాలు లేవు. ప్రభుత్వం స్పందించి మత్స్యకారులను ఆదుకోవాలి.

- దుమ్మ అశోక్‌, మత్స్యకార నాయకుడు, జీరుపాలెం

.......................

ప్రభుత్వం ఆదుకోవాలి

అకాల వర్షంతో మాకు తీవ్ర నష్టం జరిగింది. జీరుపాలెం, జగన్నాథపురం గ్రామాల మత్స్యకారులకు చెందిన ఎండు నెత్తళ్లు పూర్తిగా తడిసిపోయి కుళ్లిపోయాయి. రూ.40 లక్షల వరకూ నష్టం జరిగింది. మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి.

దుమ్మ ఎర్రయ్య, సీహెచ్‌ అప్పన్న, మత్స్యకారులు, జీరుపాలెం

Updated Date - 2023-03-20T00:13:42+05:30 IST