సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం

ABN , First Publish Date - 2023-03-18T23:55:42+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు.

సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
మాట్లాడుతున్న జేఏసీ కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు

ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దామోదరరావు

అరసవల్లి, మార్చి 18: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ‘‘చేయి చేయి కలుపుదాం’’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కలెక్టర్‌ ఆఫీసు, ట్రెజరీ, డీఆర్‌డీఏ, ఆర్టీవో, ఆర్టీసీ, తదితర కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను కలిశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 21 నుంచి చేపట్టబోయే ‘వర్క్‌ టు రూల్‌ ’ ప్రకారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కార్యాలయాల్లో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఏప్రిల్‌ 5వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఇతర ఆర్థికేతర సమస్యలపై రాతపూర్వక హామీని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంపు, హెల్త్‌ కార్డుల వినియోగం, చనిపోయిన కుటుంబాల్లో కారుణ్య నియామకాలు, తదితర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ నెల 27న కారుణ్య నియామక బాధిత కుటుంబాలను కలుస్తామన్నారు. ఏప్రిల్‌ 5న నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్‌ కె.శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి సీపాన గోవవిందరావు, నాయకులు పొందర లక్ష్మణరావు, పిసిని వసంతరావు, శ్రీనివాస్‌, బీవీఎన్‌ రాజు, ఆర్టీసీ ఈయూ జిల్లా అధ్యక్షుడు గూనాపు త్రినాథరావు, పి.నానాజీ, రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:55:42+05:30 IST