రూ.కోట్లు ఖర్చు.. పర్యవేక్షణ లేదు

ABN , First Publish Date - 2023-09-26T00:06:52+05:30 IST

కరోనా ఉధృతి సమయంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలను కాగ్‌ ఎత్తిచూపింది. మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రై రేషన్‌ పంపిణీ చేయలేదని గుర్తించింది. అలాగే నిల్వ గుడ్లు పంపిణీ చేయడం, కందిపంప్పు పంపిణీలో అక్రమాలను సైతం ప్రస్తావించింది.

 రూ.కోట్లు ఖర్చు.. పర్యవేక్షణ లేదు

- డ్రై రేషన్‌ అందజేయడంలో అక్రమాలు

- కొన్నిచోట్ల నిల్వ గుడ్లు సరఫరా చేసిన వైనం

- లోపాలను ఎత్తిచూపిన కాగ్‌ నివేదిక

- మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై పరిశీలన

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

కరోనా ఉధృతి సమయంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలను కాగ్‌ ఎత్తిచూపింది. మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రై రేషన్‌ పంపిణీ చేయలేదని గుర్తించింది. అలాగే నిల్వ గుడ్లు పంపిణీ చేయడం, కందిపంప్పు పంపిణీలో అక్రమాలను సైతం ప్రస్తావించింది. పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీలో కొన్ని చెల్లింపుల వివరాలు లేకపోవడం వంటివి కాగ్‌ గమనించింది. కాగ్‌ నివేదికను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో జిల్లాకు సంబంధించి పలు అంశాలు ఉన్నాయి.

డ్రైరేషన్‌లో లోపాలు..

కేంద్రం పథకం జాతీయ మధ్యాహ్న భోజన కార్యక్రమానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చేర్చి ‘జగనన్న గోరుముద్ద’ పథకంగా మార్పు చేసింది. అయితే కరోనా వచ్చినప్పుడు 2020 మార్చి 19 నుంచి పాఠశాలలను మూసివేశారు. దీంతో పాఠశాలల్లో భోజనం పెట్టలేకపోయారు. పాఠశాల మూసివేసినన్ని రోజులు పిల్లలందరికీ ఆహార భద్రత భత్యం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పాఠశాల పనిదినాలకు పరిగణనలోకి తీసుకుని బియ్యం, గుడ్లు, చిక్కీలతో కూడిన పొడి రేషన్‌ పంపిణీ చేయాలని ఆదేశించింది. 2020 మార్చి 19 నుంచి 2021 జులై 31 వరకు విద్యార్థులకు పొడి రేషన్‌ను పంపిణీ చేశారు. కొన్ని జిల్లాల్లో ‘మధ్యాహ్న భోజన పథకం’ నిర్వహణపై 2021 ఆగస్టు నుంచి 2021 డిసెంబరు వరకు కాగ్‌ ఆడిట్‌ చేపట్టింది.

కాగ్‌ గుర్తించిన అంశాలు..

- శ్రీకాకుళం జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో బియ్యం 81.73 కిలోలు పంపిణీ చేయాల్సిఉండగా 74.57 కిలోలు మాత్రమే ఇచ్చారు. అలాగే గుడ్లు 437కు గాను 446 పంపిణీచేశారు. చిక్కీల విషయానికొస్తే 327కి 315 పంపిణీ చేశారు. అయితే డ్రై రేషన్‌ పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందలేదని కాగ్‌ గుర్తించింది.

- జిల్లాలో వేరుశెనగ పప్పు, బెల్లంతో చేసిన చిక్కీలు 7,89,155 కేజీలు సరఫరా చేశారు. ఇందుకుగాను ఖర్చు రూ.11.68 కోట్లు.

- జిల్లాలో ఇప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలో గుడ్ల పంపిణీ 3 నుంచి 36 రోజులు ఆలస్యమైంది. చిక్కీల పంపిణీ 20 రోజులు ఆలస్యమైంది. పంపిణీలో జాప్యం జరిగినా జరిమానాలు విధించలేదు.

- జిల్లాలో 13,62,861 కిలోల కందిపప్పు పంపిణీకి గాను రూ.14.72 కోట్లు ఖర్చుచేశారు. వంద రోజులకు సరఫరా చేయాల్సిన కందిపప్పును ఏకంగా తొమ్మిది మాసాల ఆలస్యంతో సరఫరా అయింది. కానీ 2020 మార్చి 19 నుంచి 2020 ఆగస్టు 31 వరకు కందిపప్పును విద్యార్థులకు అందజేయలేదు. అప్పట్లో 237 కందిపప్పు ప్యాకెట్లు తక్కువగా సరఫరా చేశారు.

- ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, సీతంపేట, ఎచ్చెర్ల మండలాల్లో పరిశీలించగా.. కరోనా ఉధృతి వల్ల ఎంఈవోలు పొడిరేషన్‌ పంపిణీకి సంబంధించి రికార్డులను అందజేయలేదు.

- సీతంపేటలో 60 మంది హాస్టల్‌ విద్యార్థులకు 55 మందికి మాత్రమే డ్రైరేషన్‌ ఇచ్చారు. మిగిలిన వారికి మ్యాపింగ్‌ చేయకపోవడం వల్ల ఇవ్వలేదు.

- డ్రై రేషన్‌లో బియ్యం పంపిణీ చేసినప్పుడు తూనిక యంత్రాలను కాకుండా డబ్బాలను వినియోగించారు. ఎచ్చెర్ల మండలం బాదుర్లపేట ఎంపీపీఎస్‌ స్కూల్‌లో ఇలా చేశారు.

- నరసన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో మొదటి పది రోజులు సరఫరా చేసిన గుడ్లపై నీలం రంగుకాకుండా గులాబీ రంగు ఉంది. నిల్వ గుడ్లను సరఫరాచేసినట్లు కాగ్‌ గుర్తించింది. దీనిపై జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం గుడ్ల నాణ్యత, పరిమాణంపై డీఈవోకు ఫిర్యాదు చేసింది. గుడ్ల సరఫరాలో అక్రమాలు జరగకుండా బుట్టలపై ‘ఎండీఎం ఆంధ్రప్రదేశ్‌’ అని ముద్ర ఉండాలి. అది లేకుండానే అప్పట్లో పంపిణీ చేసేశారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు నాణ్యతా ప్రమాణాల నిబంధనలపై అవగాహన లేనట్లు కాగ్‌ గుర్తించింది.

- జిల్లాలో పంపిణీ చేసిన చిక్కీల గడువు తేదీలలో వ్యత్యాసం ఉంది. పొట్లాలపైన గడువు తేదీ, ఉత్పత్తి తేదీ నుంచి ఒక నెల అని ఉంది. కానీ చిక్కీ ప్యాకెట్‌కు చీటీని అంటించారు. ఉత్పత్తి తేదీ నుంచి రెండు మాసాలలోపు వినియోగించవచ్చని దానిపై రాశారు. దీన్నిబట్టి సరైన గడువు తేదీ నిర్ధారించలేదు.

- డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు మార్గదర్శకాలను పాటించక పోవడంవల్ల డ్రైరేషన్‌ పంపిణీలో ఆలస్యమైంది.

- పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో 2010 ఏప్రిల్‌ నుంచి 2017 జూన్‌ కాలంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ లేవనెత్తిన డిమాండ్‌కు.. వసూలు చేసిన మొత్తానికిగాను చెల్లింపుల వ్యవహారాలకు సంబంధించి సరైన వివరాలు అందించలేదని కాగ్‌ పేర్కొంది. అలాగే ఉద్యోగుల ఈపీఎఫ్‌ విరాళాలను ఆలస్యంగా చెల్లించినట్లు గుర్తించింది.

- ఆడిట్‌లో తనిఖీచేసిన పాఠశాలలు: నరసన్నపేట మండలం ఉర్లాం ఎంపీపీఎస్‌ పాఠశాల, నరసన్నపేట జడ్పీహెచ్‌ఎస్‌, ఇప్పిలి జడ్పీహెచ్‌ఎస్‌, సీతంపేటలో ఆడాలి జడ్పీహెచ్‌ఎస్‌, ఆమదాలవలసలో టి.మన్నయ్యపేట ప్రాథమిక పాఠశాల, ఆమదాలవలస గేట్‌వద్ద ఉన్నతపాఠశాల, ఎచ్చెర్ల మండలంలో అంబేడ్కర్‌ నగర్‌ ఎంపీపీ పాఠశాల, ధర్మవరం జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను ఆడిట్‌ విభాగం తనిఖీచేసింది.

Updated Date - 2023-09-26T00:06:52+05:30 IST