జిల్లాకు చేరిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లు

ABN , First Publish Date - 2023-08-04T00:15:18+05:30 IST

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక సిద్ధమవుతోంది. గత నెల 23న విశాఖపట్నం కలెక్టరేట్‌ నుంచి జిల్లాకు 1,440 బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), 2,100 కంట్రోల్‌ యూనిట్లు(సీయూ) అధికారులు తీసుకువచ్చారు.

జిల్లాకు చేరిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లు
ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్‌ పనితీరును పరిశీలిస్తున్న అధికారులు

- పనితీరును పర్యవేక్షిస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక సిద్ధమవుతోంది. గత నెల 23న విశాఖపట్నం కలెక్టరేట్‌ నుంచి జిల్లాకు 1,440 బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), 2,100 కంట్రోల్‌ యూనిట్లు(సీయూ) అధికారులు తీసుకువచ్చారు. వీటిని కలెక్టరేట్‌ సమీపంలో ఈవీఎం గోదాములో భద్రపరిచారు. తాజాగా 7వేల వీవీ ప్యాడ్స్‌ జిల్లాకు చేరుకోగా.. వాటిని కూడా అధికారులు పరిశీలించి.. గోదాముంలో ఉంచారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు ప్రత్యేక ఉపకలెక్టర్‌లు, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే జిల్లావ్యాప్తంగా 2,342 పోలింగ్‌ కేంద్రాలకు బీఎల్‌వోలను నియమించేశారు. ఇంటింటా ఓటర్లు నమోదు, మార్పులు చేర్పులు పరిశీలిస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు విశాఖపట్నంలో బుధ, గురువారాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సూచనలు.. జీరో ఇంటి నంబర్ల గల ఓటర్లను తొలగింపు, చేర్పులు..మార్పులు.. కిందిస్థాయి సిబ్బందిపై నిఘా ఉంచి ఓటరు జాబితా పరిశీలన పారదర్శకంగా చేపట్టాలంటూ కలెక్టర్‌లకు స్పష్టం చేసింది. జిల్లాల వారీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి.. సూచనలు జారీచేసింది. అధికారపార్టీ కీలక ప్రజాప్రతినిధులు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని ప్రకటించారు. ప్రతిపక్ష నేతలు కూడా వరుస పర్యటనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

కలెక్టర్లతో ముగిసిన ఎన్నికల కమిషన్‌ సదస్సు

విశాఖపట్నంలో రెండు రోజుల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన ప్రత్యేక సదస్సు గురువారం ముగిసింది. జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు.. కచ్చితమైన జాబితా తయారీ... డబుల్‌ ఎంట్రీలను తొలగించడం.. ఇంటి నంబర్‌లేనివి... సరికాని చిరునామా ఓటర్ల.. ఇలాంటివన్నీ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశించింది. ఈ సదస్సులో కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌ పాల్గొని.. జిల్లాకు సంబంధించి తయారుచేసిన ప్రజెంటేషన్‌ను వినిపించారు. శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి... మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Updated Date - 2023-08-04T00:15:18+05:30 IST