కోర్టులో కేసు ఉన్నా స్థలం కబ్జా

ABN , First Publish Date - 2023-08-22T00:07:08+05:30 IST

అది గ్రామకంఠం భూమి అని రెవెన్యూశాఖ చెబుతోంది. ఈ విషయమే కోర్టుకు కూడా చెప్పింది. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉంది. అయినా ఓ వైసీపీ నాయకుడు ఆ స్థలంలో చెట్లను కొట్టేశాడు. చుట్టూ కంచె వేసి కబ్జా చేసేశాడు.

కోర్టులో కేసు ఉన్నా స్థలం కబ్జా
రణస్థలంలో స్థలాన్ని చదును చేస్తున్న దృశ్యం

- చెట్లను కొట్టి కంచె వేసిన వైసీపీ నేత

రణస్థలం, ఆగస్టు 21: అది గ్రామకంఠం భూమి అని రెవెన్యూశాఖ చెబుతోంది. ఈ విషయమే కోర్టుకు కూడా చెప్పింది. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉంది. అయినా ఓ వైసీపీ నాయకుడు ఆ స్థలంలో చెట్లను కొట్టేశాడు. చుట్టూ కంచె వేసి కబ్జా చేసేశాడు. రణస్థలం ప్రాథమిక పాఠశాల సమీపాన ఉన్న 18 సెంట్ల స్థలం ఉంది. ఇది గ్రామకంఠమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ భూమిని ఓ వ్యక్తి కొన్నేళ్లపాటు అనుభవించాడు. అయితే ఈ భూమి తనదని, దాన్ని వేరొకరి వద్ద కొనుగోలు చేశానని ఓ వైసీపీ నాయకుడు ఆక్రమించే యత్నం చేశాడు. ఈ వ్యవహారంపై కోర్టుకు కూడా వెళ్లాడు. ఈ స్థలంపై తొలుత అనుభవిస్తున్న వ్యక్తికి హక్కులేదని కోర్టు తీర్పు చెప్పింది. సదరు వైసీపీ నాయకుడు ఇటీవల మరోమారు కోర్టును ఆశ్రయించగా.. ఈ భూమి గ్రామకంఠం అని రెవెన్యూ అఽధికారులు కోర్డుకు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం కోర్టులో ఉంది. అయితే వైసీపీ నాయకుడు తన అనుచరులతో సోమవారం స్థలంలోకి వెళ్లాడు. చెట్లను కొట్టి చుట్టూ కంచె వేశాడు.

ఈ కేసు పెండింగ్‌లో ఉంది

18 సెంట్లు గ్రామకంఠం స్థల వివాదం కోర్డులో ఉందని, ప్రస్తుతం ఈ భూమిలోకి ఎవరూ వెళ్లకూడదని తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ భూమిలో ఎలాంటి కట్టడాలు చేపట్టరాదన్నారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆక్రమణపై ఫిర్యాదు రాలేదు

18సెంట్ల ఆక్రమణపై తమకు ఫిర్యాదు రాలేదని జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు. ఒక ప్రైవేటు వ్యక్తి, ప్రభుత్వం మధ్య ఈ స్థలం వివాదం కోర్డులో ఉందంటూ తనకు తహసీల్దారు నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ స్థలం కాపాడే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-08-22T00:07:08+05:30 IST