సాంకేతిక విద్యకు గ్రహణం

ABN , First Publish Date - 2023-09-04T00:09:42+05:30 IST

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేక స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు నిరూపయోగంగా మారాయి. సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు ద్వారా బోధన చేపట్టాలని నిర్ణయించింది.

సాంకేతిక విద్యకు గ్రహణం
తేలుకుంచి పాఠశాలలో ఇంటర్నెట్‌ సౌకర్యం లేక వృథాగా ఉన్న స్మార్ట్‌టీవీ

- పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ ఏదీ?

- నిరుపయోగంగా స్మార్ట్‌ టీవీలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేక స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు నిరూపయోగంగా మారాయి. సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు ద్వారా బోధన చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో తొలివిడత ‘నాడు-నేడు’ పథకం పనులు పూర్తిచేసిన 498 పాఠశాలలకు వీటిని అందజేసింది. ఒక్కో స్మార్ట్‌ టీవీ రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షలు చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది. రెండు నెలల కిందట వీటిని అందజేయగా.. ఇప్పటివరకూ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించలేదు. టీవీలకు విద్యుత్‌ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో అవి పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా బోధన సాగిస్తున్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని అడిగితే.. నాడు-నేడు నిధులు వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కాగా.. గత ఏడాది పాఠశాలలకు మొదటి విడత మాత్రమే 20 శాతం నిధులు మంజూరు చేసి ఆతర్వాత చేతులు దులిపేసుకున్నారు. గతేడాది పాఠశాలల నిఽధులు వస్తాయనే ఆశతో ప్రధానోపాఽధ్యాయులు సొంత నిధులు వెచ్చించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో చాక్‌పీసులు కొనేందుకు కూడా డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ భారం తాము భరించలేమని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీలకు ఇంటర్‌ నెట్‌ కనెక్షన్‌లు ఇవ్వాలని హెచ్‌ఎంలు, విద్యార్థులు కోరుతున్నారు.

త్వరలోనే కనెక్షన్‌ ఇస్తాం

ప్రస్తుతం 66 పాఠశాలలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చాం. ఏరియాను బట్టి ఏ నెట్‌వర్క్‌ సక్రమంగా వస్తుందో పరిశీలిస్తున్నాం. సక్రమంగా పని చేస్తున్న నెట్‌వర్క్‌తో మిగతా పాఠశాలల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తాం. కొన్ని చోట్ల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు ఇంటర్‌ నెట్‌, ఇతర విద్యుత్తు బోర్డులు ఏర్పాటు చేసుకుని సాంకేతిక విద్యను స్మార్ట్‌ ఫోన్‌ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని పాఠాలను బోధిస్తున్నారు. ఇప్పటికే పలు పాఠశాలలకు సిమ్‌ కార్డులు కూడా అందజేశాం.

- ఎస్‌.జగదీష్‌, బైజూస్‌ జిల్లా సమన్వయకర్త

Updated Date - 2023-09-04T00:09:42+05:30 IST