కరెంట్ ఆపేసి.. టీడీపీ నేత ఇంటిపై దాడి
ABN , First Publish Date - 2023-09-29T00:12:28+05:30 IST
పలాసలో వైసీపీ నాయకులు బుధవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. టీడీపీ నాయకుడి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. అర్ధగంట పాటు హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
- రాత్రిపూట వచ్చి కిటికీ అద్దాలు ధ్వంసం
- పలాసలో వైసీపీ నాయకుల దాష్టీకం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
పలాస, సెప్టెంబరు 28: పలాసలో వైసీపీ నాయకులు బుధవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. టీడీపీ నాయకుడి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. అర్ధగంట పాటు హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. బాధితుడి వివరాల మేరకు.. పలాస 16వ వార్డు శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న యవ్వారి మోహనరావు టీడీపీలో చురుకైన నాయకుడు. చంద్రబాబు అరెస్టుపై జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నాడు. రెండు రోజుల కిందట కళింగ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహారదీక్షల్లో కూడా ఆయన పాల్గొన్నాడు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ఎండగట్టాడు. దీన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోయారు. సుమారు 40 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ నిలుపుదల చేసి మోహనరావు ఇంటిపై దాడి చేశారు. అరగంట పాటు అక్కడే వీరంగం సృష్టించారు. ఇంటిచుట్టూ తిరుగుతూ బయటకు రావాలని బెదిరించారు. వ్యక్తిగతంగా దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో మోహనరావు కుటుంబ సభ్యులు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయారు. అనంతరం వైసీపీ శ్రేణులు ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశాయి. వారు వెళ్లిపోయిన తర్వాత మోహనరావు బయటకు వచ్చి టీడీపీ నాయకులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. బయటకు వచ్చి ఉంటే తనపై హత్యాహత్నం చేసేవారని మోహనరావు చెబుతున్నారు. దాడి ఘటనపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మాట్లాడే స్వేచ్ఛను కూడా వైసీపీ నాయకులు హరిస్తున్నారని, విమర్శిస్తే దాడులకు దిగడం సరైన విధానం కాదని అన్నారు. గురువారం ఉదయం బాధితుడు మోహనరావుతో కలసి కాశీబుగ్గ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తన ఇంటికి రక్షణ కల్పించాలని పోలీసులకు బాధితుడు కోరాడు. ఈ మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోహనరావును టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, జోగ మల్లి, సీనియర్ నాయకుడు యార్లగడ్డ వెంకన్నచౌదిరి, దాసునాయుడు, మల్లా శ్రీనివాస్, వసంతస్వామి తదితరులు పరామర్శించారు.