రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:00 AM
జిల్లాలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రత్యేక రైళ్ల మంజూరు విషయమై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు.
- ఎంపీ రామ్మోహన్‌నాయుడు
ఆమదాలవలస, డిసెంబరు 28 : జిల్లాలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రత్యేక రైళ్ల మంజూరు విషయమై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. గురువారం రైల్వే డీఆర్‌ఎం సౌరభ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ప్రత్యేక ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రైల్వేగేటు ప్రాంతంలో కాలినడక వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలి. గూడ్స్‌షెడ్ తరలించకుండా సహకరించాలి. ఊసవానిపేట రైల్వేగేట్టు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలి’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు డీఆర్‌ఎంను కోరారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎస్.కె.గుప్తా, టీడీపీ నాయకులు లంక నాగరాజు, బి.వి.రమణమూర్తి, టి.గురయ్య, అన్నెపు భాస్కరరావు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అవసరం
అరసవల్లి : ఎన్నికలు సజావుగా జరగాలంటే స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అవసరమని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరునికి ఓటుహక్కు కల్పించాల్సిన బాధ్యత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులదే. అర్హుల ఓట్లు తొలగించడం నేరం. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,14,939 మంది ఓటర్లు ఉన్నారు. నరసన్నపేట, గాతలవలస, మబుగాంతో పాటు మత్స్యకార గ్రామాల్లో తాత్కాలిక వలసకు వెళ్లిన ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారు. పోలాకి మండలంలో చేర్పులు, తొలగింపులపై విచారణ చేసి జాబితాలో అర్హులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కచ్చితమైన ఓటర్ల జాబితా తయారుచేయాలి. ఈ విషయమై టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని సూచించారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు పాల్గొన్నారు.