నేడు జిల్లా బంద్
ABN , First Publish Date - 2023-09-11T00:29:46+05:30 IST
చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ మేరకు సోమవారం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు బంద్ పాటించనున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
- విజయవంతం చేయాలి
- ఎంపీ రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ మేరకు సోమవారం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు బంద్ పాటించనున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. వీటన్నింటినీ అధిగమించి బంద్ విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు యత్నిస్తున్నారు. మరోవైపు పోలీసు బలగాలు జిల్లాకు అదనంగా చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అక్రమ అరెస్టు చేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ఈ చర్యలకు నిరసనగా సోమ వారం చేపట్టనున్న బంద్‌ను స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం, న్యాయానికి సంకెళ్లు వేసే విధంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించే నాయకుడికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొ నాలని కోరారు.
అనుమతి లేదు: ఎస్పీ రాధిక
జిల్లావ్యాప్తంగా 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నందున.. జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్‌కు అనుమతి లేదని ఎస్పీ రాధిక ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్డు రిమాండ్ విధించిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు బలవంతంగా మూసివేయించినా, ప్రజలకు అసౌకర్యం కల్పించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.