కేజీబీవీల్లో మహిళా ఉపాధ్యాయుల తొలగింపు అన్యాయం
ABN , First Publish Date - 2023-06-22T23:38:58+05:30 IST
కేజీబీవీల్లో మహిళా ఉపాధ్యాయులను తొలగించడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్యగా మాజీ విప్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ అభివర్ణించారు.
జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్
శ్రీకాకుళం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కేజీబీవీల్లో మహిళా ఉపాధ్యాయులను తొలగించడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్యగా మాజీ విప్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ అభివర్ణించారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘2005లో ఐటీడీఏ, ఆర్వీఎం, ఏపీఎన్‌ఏ సొసైటీల ద్వారా కేజేబీవీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 32 కేజీబీవీలు ఉండగా... అప్పట్లో కొంతమందిని ఉద్యోగులుగా ఎంపిక చేశారు. మరికొందరిని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారు. ఎప్పటికైనా ఉద్యోగభద్రత దక్కుతుందన్న ఆశతో పనిచేస్తున్న.. మహిళా ఉపాధ్యాయులను తొలగించడం దారుణం. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రూ.లక్షల్లో దండుకోవాలనే ఉద్దేశంతో కేజీబీవీల్లో కొత్తగా పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నారు. అధికారులు కూడా రాజకీయ మద్దతు ఉన్నవారికి వత్తాసు పలకడం సిగ్గుచేటు. ప్రభుత్వం నోటీసులను వెనక్కి తీసుకోవాలి. మహిళా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌లపై విచారణ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగురైతు ప్రధానకార్యదర్శి సింతు సుధాకర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, టీడీపీ నాయకులు విభూది సూరిబాబు, ప్రధాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.