తిమింగళాల మృత్యువాత
ABN , First Publish Date - 2023-11-20T00:06:26+05:30 IST
నీలి తిమింగళాలు ఇటీవల మృత్యువాత పడుతున్నాయి. వాటి కళేబరాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. సముద్రంలో జీవించే జలరాశుల్లో అరుదైన నీలి తిమింగళాలు మృత్యువాత పడడానికి మానవ తప్పిదమా, లేదా ప్రకృతి వైపరీత్యామా? అన్నది చర్చనీయాంశమవుతోంది.

- తరచూ ఒడ్డుకు చేరుతున్న కళేబరాలు
- వలలే కారణమంటున్న అధికారులు
- సంరక్షణకు కనిపించని చర్యలు
(సంతబొమ్మాళి)
- ఈ ఏడాది జూలై 27న సంతబొమ్మాళి మండలం పాతమేఘవరం సముద్ర తీరానికి భారీ తిమింగళం కొట్టుకువచ్చింది. మత్స్యకారులు వెళ్లి పరిశీలించగా.. అప్పటికే అది మృతి చెందినట్టు గుర్తించారు.
................
- ఈ నెల 17న సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రతీరానికి 15మీటర్ల పొడవు, పదిటన్నులు బరువు ఉండే భారీ తిమింగళం కళేబరం కొట్టుకు వచ్చింది. మత్స్యకారులు దీన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. టెక్కలి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ జగదీష్, మత్స్యశాఖ అధికారులు ఆ తిమింగళం కళేబరాన్ని గొయ్యి తవ్వించి పూడ్చివేశారు.
................
నీలి తిమింగళాలు ఇటీవల మృత్యువాత పడుతున్నాయి. వాటి కళేబరాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. సముద్రంలో జీవించే జలరాశుల్లో అరుదైన నీలి తిమింగళాలు మృత్యువాత పడడానికి మానవ తప్పిదమా, లేదా ప్రకృతి వైపరీత్యామా? అన్నది చర్చనీయాంశమవుతోంది. సముద్రంలో మరబోట్ల దెబ్బలకు తిమింగళాలు మృతి చెందుతున్నట్టు కొందరు పేర్కొంటున్నారు. మత్స్యకారులు వేట సాగించేటప్పుడు వలల్లో చిక్కుకుని కొన్ని మృతి చెందుతున్నాయి. అలాగే సముద్రంలో చిరిగిన వలలు వదిలేయడంతో తిమింగళాలు వాటిలో చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతోపాటు సముద్రంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కలవడంతో నీటి కాలుష్యం కారణంగా మృతి చెందుతున్నాయని మరికొందరు చెబుతున్నారు. క్షీరజాతికి చెందిన నీలి తిమింగళాలు పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. ఇవి 90 అడుగుల పొడవు, 200 టన్నుల వరకు బరువు పెరుగుతాయి. ఒక్కో తిమింగళం జీవితకాలం వందేళ్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తిమింగళాలు వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తిమింగళాల సంరక్షణపై మత్స్యకారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. సముద్రంలో చిరిగిన వలలు విడిచిపెట్టకుండా, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వ్యర్థాలు వేయకుండా, నీటి కాలుష్యం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
...........................
వలలకు చిక్కి..
సముద్రంలో వలలకు చిక్కి తిమింగళాలు మృత్యవాత పడుతున్నాయి. తిమింగళాల రక్షణపై అవగాహన కల్పిస్తాం. భావనపాడు తీరానికి కొట్టుకువచ్చిన తిమింగళం ఎలా మృతి చెందిందో.. దానిపై వైద్య నివేదిక రావాల్సి ఉంది.
- జగదీష్, ఫారెస్టు రేంజర్, టెక్కలి
...........................
అవగాహన కల్పిస్తాం
తిమింగళాల అవశ్యకతపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తాం. సముద్రంలో చిరిగిన వలలు విడిచిపెట్టకూడదు. దీనికితోడు సముద్రంలో వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు తిమింగళాల మృతికి కారణమవుతున్నాయి.
- దామోదర్, ఫిషరీస్ అసిస్టెంట్, భావనపాడు