Share News

రైతులకు శాపం.. మిల్లర్లకు లాభం!

ABN , First Publish Date - 2023-12-11T00:35:33+05:30 IST

రెండేళ్ల నుంచీ ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోతున్నారు. గతేడాది వరికోతలు సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పంట నష్టం వాటిల్లింది. కల్లాల్లోనే ధాన్యం నానిపోయాయి.

రైతులకు శాపం.. మిల్లర్లకు లాభం!

- ముక్కపాయి పేరుతో అదనంగా ధాన్యం వసూళ్లు

- గత ఏడాది సమస్యలే పునరావృతం

(మెళియాపుట్టి)

- మెళియాపుట్టి మండలం మర్రిపాడు-సి గ్రామానికి చెందిన షణ్ముఖరావు అనే రైతు.. గతేడాది పండించిన ధాన్యాన్ని టెక్కలి ఆర్బీకే ద్వారా టెక్కలిలో మిల్లుకు ఎలాట్‌ చేశారు. ధాన్యం తేమశాతం ఎక్కువగా ఉందని, బస్తాకు అదనంగా 6 కిలోల ధాన్యం ఇస్తే.. తీసుకుంటామని మిల్లరు తెలిపారు. లేదంటే ధాన్యం తిరిగి తీసుకెళ్లిపోవాలని చెప్పారు. దీంతో గత్యంతరం లేక బస్తాకు 5 కిలోలు అదనంగా ఇచ్చేందుకు షణ్ముఖరావు అంగీకరించాడు. అప్పట్లో ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయాడు. ఈ ఏడాదీ కూడా ఇటీవల తుఫాన్‌ ప్రభావంతో ధాన్యం తడిచిపోయాయని, కేంద్రాల్లో వాటిని కొనుగోలు చేస్తారో? లేదోనని ఆందోళన చెందుతున్నాడు.

..................

రెండేళ్ల నుంచీ ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోతున్నారు. గతేడాది వరికోతలు సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పంట నష్టం వాటిల్లింది. కల్లాల్లోనే ధాన్యం నానిపోయాయి. తడిసిన ధాన్యం తీసుకోవడానికి మిల్లర్లు వెనుకంజ వేశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురైంది. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడురోజులపాటు విస్తారంగా వర్షాలు కురవడంతో చాలా చోట్ల వరికుప్పలు, ధాన్యం తడిచిపోయాయి. ధాన్యం రంగు మారి ముక్కిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం కాగా.. మిల్లర్లు తేమశాతం, ముక్కపాయి పేరిట బస్తాకు ఐదారు కిలోలు చొప్పున వసూలు చేస్తున్నారని లబోదిబోమంటున్నారు. గతేడాది దిగుబడులు బాగా వచ్చాయని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. ఉన్న కొద్దిపాటి ధాన్యంలో.. మిల్లర్లు అదనంగా వసూలు చేస్తే ఇక తమకు మిగిలేదేమీ లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి సక్రమంగా ధాన్యం కొనుగోళ్లు సాగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవల మెళియాపుట్టి మండలం జలగలింగుపురానికి చెందిన రైతులు తహసీల్దార్‌ పి.సరోజిని దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం విక్రయాల సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ గతంలో ఎదురైన పరిస్థితులు లేకుండా చూస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడతామని భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-12-11T00:35:35+05:30 IST