ప్రజలపై భారం.. ప్రభుత్వానికి ఎగనామం!

ABN , First Publish Date - 2023-09-03T00:05:33+05:30 IST

జిల్లావ్యాప్తంగా వ్యాపారులు సిండికేట్‌గా వ్యవహరించి.. గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) పేరుతో బియ్యం ధరలను పెంచేశారు. వినియోగదారులపై 26 కేజీల బస్తాకు సుమారు రూ.300 వరకు అదనపు భారం మోపుతున్నారు.

ప్రజలపై భారం.. ప్రభుత్వానికి ఎగనామం!

- జీఎస్టీ పేరుతో బియ్యం ధరల పెంపు

- అదేబాటలో పప్పు దినుసుల విక్రయాలు

- వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారులు

- పట్టించుకోని అధికారులు

(నరసన్నపేట)

- నరసన్నపేటలోని ఓ వ్యాపారి వద్ద రామారావు అనే వ్యక్తి 26 కేజీల సన్నబియ్యం బస్తాను రూ.1,500కు కొనుగోలు చేశాడు. గతంలో 25 కేజీల బియ్యం బస్తా రూ.1,200 ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ పేరు చెప్పి వ్యాపారి తన వద్ద బస్తాకు రూ.1,500 వసూలు చేశాడని రామారావు వాపోయారు.

..........

ఇలా నరసన్నపేటలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా వ్యాపారులు సిండికేట్‌గా వ్యవహరించి.. గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) పేరుతో బియ్యం ధరలను పెంచేశారు. వినియోగదారులపై 26 కేజీల బస్తాకు సుమారు రూ.300 వరకు అదనపు భారం మోపుతున్నారు. బియ్యంతోపాటు పప్పు దినుసులు కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మినపపప్పు, పెసరపప్పు, శనగ, కందిపప్పుపై జీఎస్టీ పేరుతో కిలోకు అదనంగా రూ.20వరకు వసూళ్లు చేస్తున్నారు. వ్యాపారులు టోకు వర్తకుల నుంచి 50కేజీల బస్తాలతో పప్పులను కొనుగోలు చేస్తారు. వీటిపై ఎటువంటి జీఎస్టీ ఉండదు. కానీ వినియోగదారులకు విక్రయించే సందర్భంలో జీఎస్టీ వసూళ్లు చేస్తూ బిల్లులు ఇవ్వకుండా దోచుకుంటున్నారు. ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. మొదట్లో బియ్యం, పప్పు దినుసుల మీద ప్రభుత్వం జీఎస్టీ విధించలేదు. ఏడాది కిందట కొత్తవిధానం తీసుకువచ్చింది. 25కేజీల లోపు బియ్యం బస్తాపై 5శాతం చొప్పున జీఎస్టీ విధించింది. ఇదే అదనుగా వ్యాపారులు కొత్త పంథాకు తెరతీశారు. ఈ నేపథ్యంలో 25కేజీలు కాకుండా.. 26 కేజీలు, 30 కేజీల బస్తాల్లో బియ్యం ప్యాకింగ్‌ చేసి.. ధరలను పెంచడంతో పాటు జీఎస్టీ పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లు వేస్తున్నారు.

బస్తాకు రూ.వెయ్యి లాభం

మిల్లర్లు లేదా వ్యాపారులు సన్నరకాలకు చెందిన ధాన్యం బస్తా(80కేజీలు)ను రైతుల వద్ద రూ.2,300కు కొనుగోలు చేస్తున్నారు. మిల్లులో ఒక ధాన్యం బస్తా మరపడితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 62 కేజీల నుంచి 65 కేజీలు బియ్యం దిగుబడి వస్తుంది. మరపట్టేందుకు హామాలీ కూలీ, విద్యుత్‌ చార్జీలు రూ.35వరకు ఖర్చు అవుతుంది. ఈ డబ్బులు.. బ్రోకన్‌ రైస్‌(నూకలు), ఊక అమ్మకం ద్వారా మిల్లర్లుకు వచ్చేస్తాయి. అలాగే ట్రాన్స్‌పోర్ట్‌, బియ్యం సంచులు, యంత్రాల అరుగుదలకు మరో రూ.300 వెచ్చించినా.. మొత్తంగా ఒక్కో బస్తాకు రూ.2,600 పెట్టుబడి పెడుతున్నారు. కాగా.. నికరంగా బస్తాకు 60కేజీల చొప్పున దిగుబడి వస్తే.. కేజీ బియ్యం 60 చొప్పున మార్కెట్‌లో రూ.3,600కు విక్రయిస్తున్నారు. అంటే ఒక బస్తాకు సుమారు వెయ్యి రూపాయలు లాభం పొందుతున్నారు. ప్రభుత్వానికి మాత్రం పైసా కూడా పన్ను చెల్లించడం లేదు. కష్టపడి పండించిన రైతులకూ గిట్టుబాటు దక్కడం లేదు.

రేషన్‌ బియ్యమే.. రీ పాలీష్‌

ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు కొనుగోలు చేసి రీ పాలీష్‌ చేస్తున్నారు. అందమైన బ్యాగుల్లో వాటిని ప్యాకింగ్‌ చేసి సన్నబియ్యం పేరిట అధిక ధరకు విక్రయిస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని కొంతమంది డీలర్లు వినియోగదారుల వద్ద కిలో రూ.12 నుంచి రూ.14 వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని మిల్లర్లకు రూ.19కు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ పాలీష్‌ చేసి కిలో రూ.45చొప్పున 26 కేజీల బస్తాను రూ.1,170కు విక్రయిస్తున్నారు. నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్‌, టెక్కలి, పోలాకి, చల్లవానిపేట, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లో ఈ తతంగం ఎక్కువగా జరుగుతోంది.

ఇలా వచ్చి.. అలా వెళ్లి..

పప్పు దినుసులు, బియ్యం రీ పాలీష్‌ విధానంపై ఫిర్యాదు చేసినా.. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలకు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. రేషన్‌ బియ్యం రీ పాలీష్‌ తెలుసుకోవాలంటే.. ఆ నెలలో మిల్లర్లు వినియోగించిన విద్యుత్‌ బిల్లులను పరిశీలిస్తే.. కొంతవరకు కనిపెట్టవచ్చు. అలాగే కొన్నిచోట్ల రేషన్‌ బియ్యం మిల్లులకు చేరకముందే మధ్యలో అధికారులకు పట్టుబడుతున్నాయి. అవి అసలు ఎక్కడకు తరలిస్తున్నారని అధికారులు ఆరా తీయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌ బియ్యం కొనుగోలు చేసే మిల్లులపై, జీఎస్టీ ఎగనామం పెట్టే వ్యాపారులపై దృష్టి సారిస్తే బండారం బయట పడే అవకాశం ఉంది.

చర్యలు తప్పవు

నిబంధనల మేరకు 25 కిలోల బియ్యంబస్తా విక్రయించే సమయంలో 5శాతం జీఎస్టీ చెల్లించాలి. పప్పులు విక్రయించే సమయంలో తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. జీఎస్టీ చెల్లించని ట్రేడర్స్‌పై ఉన్నత అధికారులు సూచనల మేరకు దాడులు చేస్తున్నాం. అపరాధ రుసంతోపాటు జీఎస్టీ వసూళ్లు చేస్తున్నాం. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు సంబంధించి వినియోగదారులు బిల్లులు తీసుకోవాలి.

- యూ.కేశవరావు, రాష్ట్ర జీఎస్టీ పన్నుల శాఖ సహాయక కమిషనర్‌, నరసన్నపేట

Updated Date - 2023-09-03T00:05:33+05:30 IST