Share News

బీసీల ద్రోహి.. జగన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2023-11-06T23:47:08+05:30 IST

‘సీఎం జగన్‌రెడ్డి.. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను రూ.75వేల కోట్లు దారి మళ్లించారు. బీసీలకు తీరని అన్యాయం చేసి ద్రోహిగా నిలిచారు’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు.

బీసీల ద్రోహి.. జగన్‌ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- రూ.75వేల కోట్ల నిధులను దారి మళ్లించారు

- బస్సుయాత్ర పేరుతో మరోసారి మోసం

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

అరసవల్లి, నవంబరు 6: ‘సీఎం జగన్‌రెడ్డి.. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను రూ.75వేల కోట్లు దారి మళ్లించారు. బీసీలకు తీరని అన్యాయం చేసి ద్రోహిగా నిలిచారు’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యలయంలో వివిధ పార్టీల నాయకులు, బీసీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. జగన్‌ పాలనలో బీసీలపై జరిగిన దాడులు - ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. తొలుత మహాత్మా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూన రవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో 10శాతం రిజర్వేషన్‌ను తగ్గించి బీసీలను 16,800 పదవులకు దూరం చేయడం నిజం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘బీసీ కార్పొరేషన్‌, 56 కులాల కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. చంద్రబాబు బీసీలకు భూములు కొనుగోలు చేసి అందిస్తే, జగన్‌రెడ్డి బీసీల నుంచి 8వేల ఎకరాల అసైన్డ్‌ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. సామాజిక న్యాయం పేరిట బస్సుయాత్రకు చేయడానికి సిగ్గు లేదా?’ అని రవికుమార్‌ నిలదీశారు. ల

- శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ‘1998లోనే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పెడితే, జగన్‌రెడ్డి వాటి రద్దు కోసం సుప్రీం కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎయిడెడ్‌ స్కూళ్లను ప్రోత్సహిస్తే జగన్‌రెడ్డి వాటి ఆస్తుల్ని కబ్జా చేస్తున్నాడు. పాఠశాల విలీనం పేరుతో పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తున్నారు. చంద్రబాబు బీసీలకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్‌రెడ్డి వారిని బిచ్చగాళ్లను చేశారు’ అని దుయ్యబట్టారు. బీసీలు మాట్లాడితే ఒక నేరంగా చూస్తున్నారని, అరెస్టులు, హత్యలతో రాష్ట్రం రావణకాష్టంగా తయారైందని ఆరోపించారు.

- టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ ‘వైసీపీ హయాంలో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయారు. 12వేల పాఠశాలలను విలీనం చేశారు. 30 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేశారు. బీసీ విద్యార్థుల విదేశీ విద్య మూలన పడింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ శాతాన్ని తగ్గించడం అన్యాయం. ఇంతటి దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాల’ని కోరారు.

- మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తోంది. వెనుకబడిన కులాల వారిని మరింత అణచివేతకు గురిచేసింది. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. రానున్న ఎన్నికల్లో బీసీలంతా ఏకమై వైసీపీకి బుద్ధి చెప్పాల’ని పిలుపునిచ్చారు.

- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ..‘టీడీపీ ప్రధానంగా బీసీల పార్టీ. వైసీపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోంది. వైసీపీ పాలనకు చరమగీతం పాడాల’ని తెలిపారు. అలాగే వివిధ బీసీ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బీసీ జిల్లా అధ్యక్షుడు కలగ జగదీష్‌, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, రాష్ట్ర బీసీ కళింగ వైశ్య సాధికారత అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు, రాష్ట్ర పొందర సాధికరత అధ్యక్షుడు డి.నర్సింహులు, ఉత్తరాంధ్ర బీసీ విభాగం కోఆర్డినేటర్‌ పి.కోటేశ్వరరావు, తమ్మిన విజయకుమార్‌, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, తెలుకల సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామరాజు, గోవింద పాపారావు, బీసీ సెల్‌ మీడియా కన్వీనర్‌ బుక్కా యుగంధర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లిబాబు, జనసేన నాయకుడు పేడాడ రామ్మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:47:10+05:30 IST