Share News

రాళ్లు తేలి.. గోతులమయమై

ABN , First Publish Date - 2023-11-20T00:01:47+05:30 IST

జిల్లాలో రోడ్ల అధ్వాన దుస్థితిపై టీడీపీ-జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు కలసి రెండోరోజు ఆదివారం కూడా నిరసనలు చేపట్టారు. ‘జిల్లాలో ఎక్కడ చూసినా అధ్వాన రహదారులే దర్శనమిస్తున్నాయి.

రాళ్లు తేలి.. గోతులమయమై
గార : ఎస్‌.మత్యలేశం రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన పార్టీ శ్రేణుల నిరసన

- జిల్లాలో ఎక్కడా చూసినా అధ్వాన రహదారులే

- రోడ్ల దుస్థితిపై కొనసాగిన టీడీపీ-జనసేన నిరసనలు

- ఎన్నాళ్లీ అవస్థలు అంటూ మండిపాటు

గార, నవంబరు 19: జిల్లాలో రోడ్ల అధ్వాన దుస్థితిపై టీడీపీ-జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు కలసి రెండోరోజు ఆదివారం కూడా నిరసనలు చేపట్టారు. ‘జిల్లాలో ఎక్కడ చూసినా అధ్వాన రహదారులే దర్శనమిస్తున్నాయి. రాళ్లు తేలి.. గోతులమయంగా మారి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్నాళ్లీ అవస్థలు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

- గార మండలం ఎస్‌.మత్స్యలేశం రోడ్డు వద్ద శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఇన్‌చార్జిలు గుండ లక్ష్మీదేవి, కోరాడ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. మత్స్యలేశం రోడ్డు రాళ్లు తేలి అధ్వానంగా తయారైనా కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ నిరంకుశపాలనకు చరమగీతం తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కైబాడి రాజు, జల్లు రాజీవ్‌, పి.కృష్ణమూర్తి, కోరాడ వెంకటరావు, అధికార్ల ఆదినారాయణ, జనసేన నాయకులు నిమ్మాడ వెంకటేష్‌, ఊట మధు, అంబటి రామకృష్ణ, సునీల్‌, పట్నాన రమణ, పిట్ట నర్సింగ్‌, బి.శంకర్‌ యాదవ్‌ అప్పన్న ఎస్‌.ఉదయ్‌భాను, హరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:01:50+05:30 IST