లక్ష మంది భక్తుల రాక

ABN , First Publish Date - 2023-01-24T23:54:58+05:30 IST

గత అనుభవాల దృష్ట్యా రథసప్తమి వేడులకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, అరసవల్లి దేవస్థానం ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ ఆంక్షలు దృష్ట్యా.. ఈ ఏడాది లక్ష మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో రథసప్తమి వేడుకల ఏర్పాట్లు గురించి వెల్లడించారు.

లక్ష మంది భక్తుల రాక
అరసవల్లి దేవస్థానం ఈవో హరిసూర్యప్రకాష్‌

లక్ష మంది భక్తుల రాక

‘రథసప్తమి’కి పక్కాగా ఏర్పాట్లు

ఉచిత, శీఘ్ర, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరుగా క్యూలైన్లు

ప్రాంగణంలో తాగునీరు, చంటిపిల్లలకు పాలు, బిస్కెట్లు

దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు.. భక్తులు సహకరించాలి

అరసవల్లి ఈవో హరిసూర్యప్రకాష్‌

(అరసవల్లి)

గత అనుభవాల దృష్ట్యా రథసప్తమి వేడులకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, అరసవల్లి దేవస్థానం ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ ఆంక్షలు దృష్ట్యా.. ఈ ఏడాది లక్ష మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో రథసప్తమి వేడుకల ఏర్పాట్లు గురించి వెల్లడించారు.

ప్రశ్న : రథసప్తమి వేడుకలకు తీసుకుంటున్న చర్యలేమిటి?

ఈవో: ఈ నెల 28న రథసప్తమి వేడుకలకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముందురోజు అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి క్షీరాభిషేకంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రతీ భక్తుడూ స్వామివారిని దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచిత, శీఘ్ర, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరుగా క్యూలైన్లు చేశాం. తోపులాటలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటుచేశాం. వివిధ శాఖల సమన్వయంతో ఆలయం లోపలా, బయట తాగునీరు అందుబాటులో ఉంచుతాం.

ప్రశ్న: వీఐపీ, డోనర్‌ పాసుల రూపంలో ఎక్కువ మంది దర్శనానికి వస్తుండడాన్ని ఎలా కట్టడి చేస్తారు?

ఈవో: కచ్చితంగా కట్టడిచేస్తున్నాం. డోనర్‌ పాస్‌కు కేవలం నలుగురికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. అదనంగా కావాలంటే రూ. 500తో ప్రత్యేకదర్శన టిక్కెట్‌ తీసుకుని వెళ్లాల్సిందే. అలాగే వీఐపీ పాస్‌తో కేవలం ఇద్దరికి మాత్రమే విడిచిపెడతాం. రూ.100తో శ్రీఘ్ర దర్శనం, రూ.500తో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న : క్యూలైన్ల ప్రవేశాలు, పార్కింగ్‌ ఎక్కడెక్కడ?

ఈవో : డోనర్‌ పాస్‌లున్నవారికి, రూ.500తో ప్రత్యేక దర్శన టిక్కెట్ల తీసుకున్నవారికి పెద్దతోట వద్ద, బొంపాడవీధి వద్ద, ఆర్చి గేటు వద్ద ఇలా మూడు క్యూలైన్లలో ప్రవేశం కల్పించాం. అలాగే శ్రీఘ్రదర్శనం, ఉచిత దర్శనం క్యూలైన్లలో భక్తులకు అరసవల్లి హైస్కూల్‌ వద్ద నుంచి ప్రవేశం కల్పిస్తాం. అరసవల్లి నాలుగు దారుల్లో పార్కింగ్‌ ఏర్పాటుచేశాం. వీఐపీలకు చెందిన వాహనాలను సైతం కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం.

ప్రశ్న : సూర్యజయంతి నాడు ప్రత్యేక సేవలేమిటి?

ఈవో: శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు సుప్రభాత సేవతో సేవలు ప్రారంభమవుతాయి. పంచామృత అభిషేకం, క్షీరాభిషేకం నిర్వహిస్తాం. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తాం. మధ్యాహ్నం 3.30 గంటల వరకూ స్వామివారి నిజరూప దర్శనం కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి విశేష పుష్పాలంకరణ సేవ. రాత్రి 11 గంటల తర్వాత పవళింపు సేవ ఉంటుంది.

ప్రశ్న : దివ్యాంగులు, వృద్ధుల, చంటిపిల్లల కోసం తీసుకుంటున్న చర్యలేమిటి?

ఈవో: తోపులాటలు జరుగుతున్న దృష్ట్యా ఈ ఏడాది ఉచిత ప్రసాద పంపిణీని నిలిపివేశాం. వృద్ధులు, దివ్యాంగుల కోసం అరసవల్లి మిల్లు జంక్షన్‌ నుంచి నేరుగా స్వామివారి సింహద్వారం వద్దకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశాం. అక్కడ నుంచి వీల్‌చైర్‌లతో నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లే సదుపాయం కల్పించాం. చంటిపిల్లలు, చిన్నారుల కోసం ఎప్పటిలానే పాలు, బిస్కెట్లను సరఫరా చేస్తాం. అలాగే పసిపిల్లలకు పాలుపట్లే తల్లులకోసం మూడు చోట్ల ఫీడింగ్‌ సెంటర్‌లను ఏర్పాటుచేశాం.

Updated Date - 2023-01-24T23:54:58+05:30 IST