ప్రజలంటే అంత వెటకారమా?
ABN , First Publish Date - 2023-05-26T00:06:13+05:30 IST
Are people so greedy? భూములున్నా ఇంతవరకు రూపాయి కూడా రైతు భరోసా పడలేదు. ఇదేనా మీ ప్రభుత్వం పనితీరు? అర్హత ఉన్నా ప్రభుత్వం పథకాలు అందటంలేదు’ అని వాండ్రంగి గ్రామం బెవర వీధికి చెందిన బెవర కోటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను నిలదీశారు.

జగన్‌నే అడగండని చెబుతారా?
అర్హులకు పథకాలు ఇవ్వరా?
నిలదీసిన వాండ్రంగి వాసులు
జి.సిగడాం, మే 25: భూములున్నా ఇంతవరకు రూపాయి కూడా రైతు భరోసా పడలేదు. ఇదేనా మీ ప్రభుత్వం పనితీరు? అర్హత ఉన్నా ప్రభుత్వం పథకాలు అందటంలేదు. గ్రామ సచివాలయ వ్యవస్ధ ఉన్నా దండగే. రైతు భరోసా ఎందుకు పడటంలేదని అడిగితే తిన్నగా వెళ్లి జగన్‌నే అడగండని సచివాలయ సిబ్బంది వెటకారంగా చెబుతున్నారు’ అని వాండ్రంగి గ్రామం బెవర వీధికి చెందిన బెవర కోటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను నిలదీశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం వాండ్రంగి గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకి చుక్కెదురైంది. పట్టాదారు పాసుపుస్తకానికి రూ.7వేలు తీసుకున్నారని, ఇంకా 20 సెంట్లు పాస్‌పుస్తంలో ఎక్కలేదని బెవర కోటేశ్వరరావు మండిపడ్డారు. కాలువలు, రోడ్లు లేక అపరిశుభ్రత తాండవిస్తున్నా పట్టించుకోవడంలేదని, విద్యుత్ దీపాలు లేకపోవటంతో చీకటిలో ఉంటున్నామని చాకలివీధికి చెందిన వజ్జపర్తి రమణమ్మ, ఎండమూరి గౌరమ్మ, సూరీడు, అప్పలసూరమ్మ తదితరులు అన్నారు. బెవర వీధిలో ఒకే కొళాయి ఉందని, నీరు ఎప్పుడు వస్తుందో తెలియదని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సాకేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.