ఆక్వా రైతులు కుదేలు

ABN , First Publish Date - 2023-05-25T23:41:05+05:30 IST

జిల్లాలో ఆక్వా రైతులు కుదేలయ్యారు. వివిధ కారణాల వల్ల సన్న, చిన్నకారు రైతులు లక్షలాది రూపాయలతో తయారుచేసిన చెరువులు అమ్ముకుంటున్నారు. ప్రధానంగా ఆక్వా సాగు కరోనా అనంతరం జూదంలా మారింది. విదేశాలకు రొయ్యల ఎగుమతులు తగ్గడంతో పాటు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఖర్చులు పెరగడంతో సన్న, చిన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఆక్వా రైతులు కుదేలు
డొంకూరు సమీపంలో ఖాళీగా వదిలేసిన రొయ్యిల చెరువులు

ఇచ్ఛాపురం రూరల్‌ : జిల్లాలో ఆక్వా రైతులు కుదేలయ్యారు. వివిధ కారణాల వల్ల సన్న, చిన్నకారు రైతులు లక్షలాది రూపాయలతో తయారుచేసిన చెరువులు అమ్ముకుంటున్నారు. ప్రధానంగా ఆక్వా సాగు కరోనా అనంతరం జూదంలా మారింది. విదేశాలకు రొయ్యల ఎగుమతులు తగ్గడంతో పాటు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఖర్చులు పెరగడంతో సన్న, చిన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

తగ్గుతున్న సాగు

జిల్లాలో అధికారుల గణాంకాల ప్రకారం 11 తీర ప్రాంత మండలాల్లో 1200 హెక్టార్ల విస్తీర్ణంలో రొయ్యిల చెరువులు సాగు చేస్తున్నారు. కానీ ఈఏడాది 800 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. దీనికి తోడు ఎండల తీవ్రతకు రొయ్యలు విలవిల్లాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. ఉక్కపోతతో చెరువుల్లోని ఆక్సిజన్‌ స్థాయి గణనీయంగా పడిపోవడంతో రొయ్యను కాపాడుకోవడం కత్తిమీద సాములా మారింది. నిత్యం ఏరియేటర్లు వినియోగించాల్సివస్తోంది.

అంతా ప్రతికూలమే..

ఆక్వా సాగులో చిన్న, మధ్యతరగతి రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గతంలో పెట్టుబడులు తక్కువగా ఉండడంతోపాటు లాభాలు పుష్కలంగా వచ్చేవి. ప్రస్తుతం పెట్టుబడి విపరీతంగా పెరగడం, లాభాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సహాకాలు అంతంతమాత్రంగా ఉండడంతో ఆక్వా సాగుపై రైతులు ఆసక్తి తగ్గుతోంది. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడమే కాకుండా, విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు కూడా ఇచ్చేంది. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు వేలాది రూపాయలు చెల్లించాల్సి రావడం, విద్యుత్‌ చార్జీలు పెరగడం, చెరువుల్లో ఆక్సిజన్‌ సమకూర్చే ఏరియేటర్లు, డీజిల్‌ ధరలు పెరగడంతోపాటు రొయ్యలకు సరైన మార్కెటింగ్‌ లేకపోవడం, మేత ధరలు రెట్టింపు కావడం తదితర కారణాలతో నష్టాలను ఎదుర్కొంటున్నారు. చెరువులను లీజులకు ఇచ్చినా నష్టాలను పూడ్చుకోవడం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు.

గిట్టుబాటులేక..

సాగులో ఖర్చులు పెరగడం, పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర లేకపోవడం, ఎగుమతులు తగ్గడంతో ఈ ఏడాది ఆక్వాసాగు విస్తీర్ణం తగ్గింది. ఎక్కువ పెట్టుబడులు పెట్టలేక రైతులు సాగు చేసేందుకు మక్కువ చూపడంలేదు. కౌలు రైతులూ ముందుకు రాలేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రొయ్యల ఎదుగుదలకు అనుకూలం కూడా కాదు. పరిస్థితులపై రైతులకు సూచనలు చేస్తున్నాం.

- ముసలి నాయుడు, ఇన్‌చార్జి ఎఫ్‌డీవో, ఇచ్ఛాపురం

Updated Date - 2023-05-25T23:41:05+05:30 IST