అక్కాచెల్లెమ్మలకు ‘ఆసరా’ ఏదీ?

ABN , First Publish Date - 2023-02-04T00:09:09+05:30 IST

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నగదు జమపై అయోమయం నెలకొంది. డ్వాక్రా మహిళలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పేరుతో నగదును వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది.

అక్కాచెల్లెమ్మలకు ‘ఆసరా’ ఏదీ?

- మూడోవిడత రుణమాఫీపై జాప్యం

- సాయం కోసం మహిళా సంఘాల ఎదురుచూపు

(టెక్కలి/ఇచ్ఛాపురం రూరల్‌)

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నగదు జమపై అయోమయం నెలకొంది. డ్వాక్రా మహిళలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పేరుతో నగదును వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది. నాలుగు విడతలుగా నగదు జమ చేస్తామని సీఎం జగన్‌ గతంలో ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండు విడతలుగా మాఫీ అమలు చేశారు. ప్రస్తుతం మూడో విడత రుణమాఫీ ప్రక్రియ జాప్యమవుతోంది. ఎప్పుడు నగదు జమ చేస్తారనేదానిపైనా స్పష్టత లేకపోవడంతో మహిళా సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కొరవడిన స్పష్టత :

- ఆసరా పథకం కింద జిల్లావ్యాప్తంగా మొదటి విడత 2020 సెప్టెంబరులో 38,647 మహిళా సంఘాల్లోని 4,31,734 మంది మహిళలకు రూ.280.36 కోట్లు విడుదల చేశారు.

- 2021 అక్టోబరు 10న రెండో విడత 38,805 మహిళా సంఘాల్లోని 4,18,397 మంది మహిళలకు రూ.282.36 కోట్లు జమ చేశారు.

- మూడో విడత 2022 సెప్టెంబరు, అక్టోబరులో విడుదల చేయాల్సి ఉండగా.. జాప్యమవుతోంది. మూడో విడతకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, తేదీ మాత్రం నేటికీ ప్రకటించలేదు.

- జిల్లావ్యాప్తంగా 38,801 సంఘాల్లో 4,18,384 మంది సభ్యులున్నారు. వీరందరికి రూ.282.36 కోట్లు వరకు మూడో విడత ఆసరా కింద ప్రయోజనం చేకూరాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో సోషల్‌ ఆడిట్‌తో పాటు ఆన్‌లైన్‌ పక్రియ పూర్తిచేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల బయోమెట్రిక్‌ను పూర్తి చేసి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇంతవరకూ మహిళా సంఘాల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీనిపై గ్రామ, మండల స్థాయిలో ప్రతినెలా మహిళా సంఘాల సమావేశాల్లో చర్చలు సాగుతున్నాయి. నిధుల లేమితోనే నగదు జమ తేదీ ప్రకటనలో జాప్యమవుతున్నట్లు మహిళా సంఘాల సభ్యులు చర్చించుకుంటున్నారు. నగదు ఎప్పుడు జమవుతుందని ఆయా గ్రామాల సీసీలను ఆరా తీస్తున్నారు. వివరాలను ఆప్‌లోడ్‌ చేశామనీ, నగదు త్వరలోనే జమవుతుందని సీసీలు చెబుతున్నట్లు సమాచారం. దీంతో మహిళా సంఘాలకు ఎదురుచూపు తప్పడం లేదు.

త్వరలోనే.. :

వైఎస్సార్‌ ఆసరా మూడో విడతకు సంబంధించి జాబితా సిద్ధం చేశాం. ఇప్పటివరకు వంద శాతం మహిళా సంఘాల సభ్యులు బయోమెట్రిక్‌ను పూర్తి చేశాం. త్వరలోనే మహిళా సంఘాలకు నగదు జమ చేసే అవకాశం ఉంది.

- డి.విద్యాసాగర్‌, డీఆర్‌డీఏ పీడీ, శ్రీకాకుళం.

Updated Date - 2023-02-04T00:09:11+05:30 IST