కదంతొక్కిన అంగన్‌వాడీలు
ABN , First Publish Date - 2023-09-26T00:05:19+05:30 IST
అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి ర్యాలీగా బయలుదే రి కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకున్నారు.

- సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్
- కలెక్టరేట్ వద్ద ధర్నా
అరసవల్లి, సెప్టెంబరు 25: అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి ర్యాలీగా బయలుదే రి కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంగన్‌వాడీల మధ్య తోపులాట జరిగింది. 42 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి 1వ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, అంగన్‌వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.కళ్యాణి మాట్లాడుతూ.. విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో తాము పాల్గొనకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టులకు పాల్పడిందని, నిర్భంధాలకు గురి చేస్తోందని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ కంటే వెయ్యి రూపాయల అదనంగా వేతనం ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌గా చెల్లించాలని కోరారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనం పేరుతో తమకు అమ్మఒడి, చేయూత, ఆసరా, వంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని, వాటిని వెంటనే అమలు చేయాలన్నారు. రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, అంగన్‌వాడీ నాయకులు లతాదేవి, జె.కాంచన, పి.ఆదిలక్ష్మి, కె.సుజాత, రాజేశ్వరి, మంజుల, బి.సింహాచలం, భూలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.