Share News

మాట నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:27 AM

ఎన్నికల హామీలు అమలుతో పాటు సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మునిసిపల్‌ కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరవధిక సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకారులు ఆరోపించారు.

మాట నిలబెట్టుకోవాలి
శ్రీకాకుళంలో సమగ్రశిక్ష ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ నేతలు

- నిరవధిక సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

- తక్షణమే సమస్యలను పరిష్కరించ ండి

- కొనసాగుతున్న అంగన్‌వాడీలు, సమగ్ర శిక్ష, మునిసిపల్‌ కార్మికుల ఆందోళనలు

కలెక్టరేట్‌/ అరసవల్లి, డిసెంబరు 29: ఎన్నికల హామీలు అమలుతో పాటు సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మునిసిపల్‌ కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరవధిక సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన దీక్షా శిబిరాలను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, టీడీపీ నేతలు సందర్శించి.. వారికి మద్దతు తెలిపారు. హామీలు అమలు చేయాలని కోరుతున్నా.. ప్రభుత్వం సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

- శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా చేశారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. 18 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- సమగ్రశిక్ష ఉద్యోగులు కలెక్టరేట్‌ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే పార్కు వద్ద శుక్రవారం వంటా-వార్పు చేపట్టి నిరసన తెలిపారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమగ్రశిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు.

- శ్రీకాకుళం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మునిసిపల్‌ కార్మికులు ధర్నా చేశారు. సమస్యల పరిష్కారంలో చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు అరుగుల గణేష్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆప్కాస్‌ కార్మికులకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, క్లాప్‌ డ్రైవర్లకు 18,600 జీతం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కళ్యాణ రాజు, అర్జిరాము, ఏ.రాజేష్‌, టి.వెంకటలక్ష్మి, టి.మల్లమ్మ, జె.మాధవి, ఏ.మోహన్‌, డి.యుగంధర్‌, ఎం.నారాయణరావు, డి.సురేష్‌కుమార్‌, ఎం.అప్పన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:27 AM