వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-03-18T23:44:09+05:30 IST

: ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం అని కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ పిలుపునిచ్చారు.

 వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌

అరసవల్లి, మార్చి 18 : ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం అని కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ పిలుపునిచ్చారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రానున్న రెండు నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై ప్రతిఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎంపీడీవోల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించి తగినన్ని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని పాఠశాలల్లో ప్రతీ రెండు గంటలకు బెల్‌ కొట్టి, విద్యార్థులందరూ నీరు తాగేలా చూడాలి. అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల కోసం తాగునీటి తొట్టెలను ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉండేలా చూడాలి. వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై వైద్యారోగ్యశాఖ సిబ్బంది తక్షణం స్పందించాలి. 104, 108 వాహన సేవలను మరింత విస్తృతం చేయాలి. వడదెబ్బ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ తనకు నివేదించాలి. వేసవిలో అనవసరంగా ప్రజలు బయటకు రావద్దు. అత్యవసర పనులను ఉదయమే పూర్తి చేసుకోవాలి.’’ అని కలెక్టర్‌ సూచించా రు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి నిశా కుమారి, నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్‌, డ్వామా పీడీ చిట్టిరాజు, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:44:09+05:30 IST