వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:40:21+05:30 IST

వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తక్షణమే అందించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్‌ చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులతో కలిసి వచ్చి కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌కు వినతిపత్రం అందించారు.

 వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించాలి
కలెక్టర్‌కు వంశధార నిర్వాసితుల సమస్యలను వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తక్షణమే అందించాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ డిమాండ్‌ చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులతో కలిసి వచ్చి కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితులకు అదనపు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడు నెలలు కావస్తుందన్నారు. కేవలం కొంతమందికే పరిహారం అందించి అధిక సంఖ్యలో నిర్వాసితులకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. నిర్వాసితుల జాబితాను తప్పులు తడకలుగా అప్‌లోడ్‌ చేసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు చేసిన తప్పులకు నిర్వాసితులను బలిచేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం సరికాదన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వంశధార నిర్వాసితులు పాల్గొన్నారు.

వినతులు పరిష్కరించాలి: కలెక్టర్‌

స్పందనకు వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. జడ్పీ కార్యాలయ సమావేశమందిరంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 193 వినతులు వచ్చాయి. వీటిలో పలు ప్రజాసమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు అధికంగా ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి ఎంతో వ్యయ, ప్రయాసాలతో సమస్యలు చెప్పుకోవడానికి అర్జీదారులు వచ్చారని, వారి వినతుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జేసీ ఎం.నవీన్‌, ఉప కలెక్టర్‌ జి.జయదేవి, డీఆర్వో ఎం.రాజేశ్వరి, డీఆర్‌డీఏ పీడీ డి.విద్యాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

టిడ్కో గృహాలను తక్షణమే అందించాలి

టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించిన జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టిడ్కో గృహాల కోసం లబ్ధిదారులు గతంలో డబ్బులు చెల్లించినప్పటికీ వాటిని అందించకపోవడం అన్యాయమన్నారు. జగనన్న లేఅవుట్‌ల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇసుక, ఇనుము, సిమ్మెంట్‌ ధరలు ఆకాశాన్ని తాకడంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.1.80లక్షల సహాయాన్ని రూ.5లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు చిక్కాల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు ‘స్పందన’కు 28 వినతులు

శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జీఆర్‌ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 28 వినతులు అం దాయి. మిస్సింగ్‌ కేసుపై 1, ఛీటింగ్‌పై 2, కుటుంబ వివాదాలపై 6, ఆస్తి తగా దాలపై 4, ఇతర సమస్యలపై 10 వినతులు అందాయి. వీటిని సకాలంలో పరిష్కరించి నివేదికను తనకు అందజేయాలని ఎస్పీ ఆదేశించారు.

Updated Date - 2023-02-06T23:40:28+05:30 IST