వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు

ABN , First Publish Date - 2023-09-22T23:52:20+05:30 IST

జి.సిగడాం మండలంలోని వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ను తీరును నిరసిస్తూ.. 15 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సమావేశమయ్యారు.

వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు
ఎమ్మెల్యే కిరణ్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపిన వైసీపీ నాయకులు

- ఎచ్చెర్ల ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశం

- గొర్లె కిరణ్‌ వద్దంటూ నాయకుల నినాదాలు

- గ్రూపులకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపణ

జి.సిగడాం, సెప్టెంబరు 22: జి.సిగడాం మండలంలోని వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ను తీరును నిరసిస్తూ.. 15 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సమావేశమయ్యారు. గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. కిరణ్‌ వద్దంటూ నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో కిరణ్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఆయనకు టిక్కెట్‌ ఇస్తే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. వాండ్రంగిలో మాజీ సర్పంచ్‌, సీనియర్‌ నాయకుడు బూరాడ వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ వ్యతిరేక వర్గీయులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి పెంట, నాగులవలస, బాతువ, పాలఖండ్యాం, సంతవురిటి, ఆనందపురం, జి.సిగడాం, సర్వేశ్వరపురం, పున్నాం, నమిడివలస, ఎందువ, గెడ్డకంచరాం, జగన్నాధవలస, నక్కపేట, వాండ్రంగి గ్రామాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ మక్క వెంకటి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే కిరణ్‌ విస్మరించి.. గ్రూపు రాజకీయాలను నడుపుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో ఇప్పటికే వర్గపోరుకు కంకణం కట్టుకున్నారని.. ఇక జి.సిగడాం వంతు పడిందని ఎద్దేవా చేశారు. స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యురాలు లేకుండా ఇటీవల వాండ్రంగిలో రైతుభరోసా, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌ భవనాలను ఆయన ప్రారంభించటం వర్గపోరుకు నిదర్శనమని తెలిపారు. వర్గపోరుతో కిరణ్‌ని ఇంటికి పంపించడం ఖాయమని హెచ్చరించారు. కిరణ్‌కి టిక్కెట్‌ ఇస్తే తామంతా సహకరించేది లేదని స్పష్టం చేశారు. జగన్‌ ముద్దు.. కిరణ్‌ వద్దు అని వ్యతిరేక వర్గీయులంతా నినాదాలు చేశారు. సమావేశంలో సర్పంచ్‌లు సాకేటి నాగరాజు, మాజీ సర్పంచ్‌ ప్రతినిధులు చిత్తిరి మోహన్‌రావు, డి.ధర్మరాజు, పి.అక్కలనాయుడు, బత్తుల నాని, కలిశెట్టి శాంతారాం, ఆబోతుల జగన్నాఽథం, సీహెచ్‌ ఆర్‌కే రంగారావు, వి.రమణ, అప్పలనాయుడు, సూర్యనారాయణ, రవి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:52:20+05:30 IST