పిచ్చికుక్క స్వైరవిహారం
ABN , First Publish Date - 2023-09-22T23:52:28+05:30 IST
పలాస-కాశీబుగ్గలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. శుక్రవారం సాయంత్రం 20 మందిపై దాడి చేసింది. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
- 20 మందికి తీవ్ర గాయాలు
- ఒక మహిళ పరిస్థితి విషమం
పలాస/కాశీబుగ్గ, సెప్టెంబరు 22: పలాస-కాశీబుగ్గలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. శుక్రవారం సాయంత్రం 20 మందిపై దాడి చేసింది. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఆ పిచ్చికుక్కను హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సీతమ్మతల్లి చేపలమార్కెట్ వీధి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై పిచ్చికుక్క శుక్రవారం సాయంత్రం దాడి చేసింది. 20 మందిని గాయపరిచింది. ఆర్.లక్ష్మణరావు, బి.దుర్యోధన, వై.చిన్నమ్మలు, టి.సోమయ్య, ఎస్.రజని, టి.రామారావు, వై.ఢిల్లీశ్వరరావు, ఎన్.కృష్ణారావు, కె.ఢిల్లీశ్వరరావు, బి.బెహరా, ఎ.సతీష్, ఎస్.చిరంజీవి, కె.మంత్ర, ఎన్.భాస్కరరావు, కె.దామోదర్‌రావు, వై.ఢిల్లీశ్వరి, ఎం.మోహనరావు, టి.రోహిత్, చింతానాయక్, రౌతు హరి తీవ్ర గాయాలకు గురయ్యారు. స్థానికులు కర్రలతో కొట్టి పిచ్చికుక్కను హతమార్చారు. కుక్కకాటు బాధితులను పలాసలోని సీహెచ్‌సీకి తరలించారు. వారందరికీ వైద్యాధికారి మేఘన ఆధ్వర్యంలో సిబ్బంది సేవలు అందజేశారు. బాధితుల్లో చిన్నమ్మలు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డబ్బీరు భవానీ శంకర్, తహసీల్దార్ ఎల్.మధుసూదనరావు పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందజేయాలని మునిసిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్ సూచించారు. జంటపట్టణాల్లో కుక్కల సంతతి పెరిగిపోతుందని, వాటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.