29 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2023-05-26T00:09:56+05:30 IST
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశపరీక్ష(పాలిసెట్) రాసిన అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్ 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. జిల్లాలో 11,198 మంది పాలిసెట్ రాయగా, ఇందులో 9,705 మంది అర్హత సాధించారు.

- జూన్ 1వ తేదీలోగా ప్రొసెసింగ్ ఫీజు చెల్లించాలి
- 9న సీట్ల కేటాయింపు..
- 15 నుంచి తరగతులు ప్రారంభం
(ఎచ్చెర్ల)
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశపరీక్ష(పాలిసెట్) రాసిన అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్ 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. జిల్లాలో 11,198 మంది పాలిసెట్ రాయగా, ఇందులో 9,705 మంది అర్హత సాధించారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 754 సీట్లు ఉన్నాయి. శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర, ఐతం, నారాయణ, టీవీఆర్ ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1,840 సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఫ అభ్యర్థులు జూన్ 1వ తేదీలోగా ప్రొసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చొప్పున ఏపీ పాలిసెట్ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో చెల్లించాలి. అనంతరం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. జూన్ 6లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 7న మార్పులు, చేర్పులకు వీలుంది. 9న సీట్ల కేటాయింపు వివరాలను పాలిసెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. ప్రత్యేక కేటగిరిలో సీట్లు పొందాలనుకొనే అభ్యర్థులు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి.
ర్యాంకుల వారీగా పరిశీలన
ఈ నెల 29న 1 నుంచి 12 వేల లోపు, 30న 12,001 నుంచి 28 వేల లోపు, 31న 28,001 నుంచి 43 వేల ర్యాంకు లోపు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. జూన్ 1న 43,001 నుంచి 58 వేల లోపు, 2న 58,001 నుంచి 74 వేలు, 3న 74,001 నుంచి 91,000 వరకు, 4న 91,001 నుంచి 1,08,000 వరకు, 5న 1,08,001 నుంచి చివరి ర్యాంకుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.
సకాలంలో ఫీజు చెల్లించాలి
పాలిసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సిన అభ్యర్థులు నిర్ధేశించిన సమయంలోగా ప్రొసెసింగ్ ఫీజును చెల్లించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులు నేరుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రానికి హాజరుకావాలి. సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రంలోని నిర్వాహకులను సంప్రదించాలి.
- జి.దామోదరరావు, సమన్వయకర్త, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాకుళం