YCP: వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం.. కారణం వైసీపీ కీలక నేతే..!

ABN , First Publish Date - 2023-02-02T21:06:33+05:30 IST

నంద్యాల జిల్లా (Nandyala District) నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ (MLA Arthur)కు గురువారం అవమానం జరిగింది. పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్‌ సచివాలయం...

YCP: వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం.. కారణం వైసీపీ కీలక నేతే..!

పగిడ్యాల: నంద్యాల జిల్లా (Nandyala District) నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ (MLA Arthur)కు గురువారం అవమానం జరిగింది. పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్‌ సచివాలయం-1 పరిధిలో గురువారం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే ఆర్థర్‌, నాయకులు గ్రామానికి చేరుకొని బస్టాండ్‌లో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎంపీడీవో వెంకటరమణకు చెప్పారు. వలంటీర్లు ఎవరూ హాజరు కాలేదని ఆయన ఎమ్మెల్యేతో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లు ఎందుకు గైర్హాజరయ్యారని, ముందుగానే తమకు చెప్పి ఉంటే ఇక్కడి దాకా వచ్చేవారిమి కాదు కదా? అని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమానికి వలంటీర్లు (Volunteers) హాజరు కాకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించాలని సమాచారం ఇవ్వడంతోనే ఇక్కడికి వచ్చామని, ఇప్పుడు వలంటీర్లు గైర్హాజరయ్యారని చెప్పడం సరికాదని అన్నారు. అయితే వలంటీర్లు ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దని అధికార పార్టీలోని ఓ వర్గం వారు హుకుం జారీ చేసినట్లు గురువారం ఉదయం తెలిసిందని ఎమ్మెల్యేకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అనతరం ఎంపీడీవో వెంకటరమణ వలంటీర్లతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలను తెలుసుకొని 19 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.

హాజరు కావొద్దని వలంటీర్లకు హుకుం?

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరూ హాజరు కావొద్దని శాప్‌ చైర్మన్‌ సిద్ధార్థరెడ్డి (Siddhartha Reddy) వర్గానికి చెందిన ఓ నాయకుడు హుకుం జారీ చేసినట్లు సమాచారం. గ్రామంలో బీజేపీ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న కారణంతో ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-02T21:15:00+05:30 IST