వైసీపీ నేత బరితెగింపు

ABN , First Publish Date - 2023-01-18T00:47:40+05:30 IST

సింగరాయకొండలో వైసీపీ నాయకుడైన పంచాయతీ వార్డుసభ్యుడు బరితెగించాడు. అర్ధరాత్రి ఆలయానికి చెందిన బావిని మట్టితో పూడ్చివేశాడు.

వైసీపీ నేత బరితెగింపు

అర్ధరాత్రి ఆలయ బావి పూడ్చివేత

గుడి స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మాణం

తిరగబడిన స్థానిక యువకులు.. కబ్జాదారుడితో వాగ్వివాదం

అక్రమంగా కట్టిన గోడ కూల్చివేత

సింగరాయకొండ, జనవరి 17 : సింగరాయకొండలో వైసీపీ నాయకుడైన పంచాయతీ వార్డుసభ్యుడు బరితెగించాడు. అర్ధరాత్రి ఆలయానికి చెందిన బావిని మట్టితో పూడ్చివేశాడు. గుడి స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించాడు. ఇది తెలుసుకొని స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో యువకులు ఏకమై అక్రమంగా నిర్మించిన గోడను బద్దలు కొట్టారు. ఈ సందర్భంగా కబ్జాదారుడికి, వారికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలయోగినగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలయోగి నగర్‌లోని 668 సర్వే నంబర్‌లో బాలయోగిస్వామి గుడి ఉంది. ఈ గుడి ప్రతిష్ఠ 1969లో జరిగింది. 1992లో దాతల సహకారంతో మండపం నిర్మించారు. గుడి స్థలంలో ఏళ్ల నాటి నుంచి తాగునీటి బావి ఉంది. స్థానికులంతా గతంలో ఈ బావి నుంచే నీటిని తీసుకెళ్లేవారు. ఇప్పటికీ అది వినియోగంలో ఉందని చెప్తున్నారు. ఇటీవల గుడి స్థలాన్ని అనుకొని వైసీపీ చెందిన పంచాయతీ వార్డు సభ్యుడు ఇంటిని, షాపులను నిర్మించాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి తన ఇంటి నిర్మాణానికి వెనుక వైపు అనుకొని ఉన్న గుడి స్థలంలో ఉన్న బావిని పూడ్చేశారు. ఆలయ స్థలాన్ని అక్రమించి ప్రహరీ నిర్మించాడు. స్థానికులు అడ్డుకోవడంతో నిలిపివేసి వారు వెళ్లిన తర్వాత పూర్తి చేశాడు.

బావి పూడ్చివేతపై బాలయోగినగర్‌ వాసుల ఆగ్రహం

విషయం తెలుసుకున్న బాలయోగినగర్‌కు చెందిన స్థాని కులు, యువకులు పెద్దసంఖ్యలో గుడి వద్దకు చేరుకున్నా రు. బావిని పూడ్చివేసిన వైసీపీ నేతపై మండిపడ్డారు. ఆ స్థలం గుడిది కాదని తనదని దానికి సంబందించిన పత్రాలు ఉన్నాయంటూ కజ్జాదారుడు వాదన దిగాడు. దీంతో తీవ్రస్థాయిలో వాగ్వివాదం చేసుచేసుకుంది. అనంతరం ఆలయ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను గడ్డపలుగులతో స్థానిక యువకులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఫిరోజ్‌ఫాతిమా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2023-01-18T00:47:41+05:30 IST