యమడేంజర్...
ABN , First Publish Date - 2023-03-02T23:49:55+05:30 IST
చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టుకు వెళ్తున్న రాళ్ల రవాణా వాహనాలు యమడేంజర్‌గా మారాయి. ఆ వాహనం వస్తుందంటేనే జనానికి దడ మొదలవుతోంది. సుమారు 40 నుంచి 50 టన్నుల రాళ్లను ఎటువంటి రక్షణ లేకుండా రవాణా చేస్తున్నారు. దానికితోడు అతివేగం, ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తున్న పరిస్థితి. దీంతో రాళ్లు పక్కన వస్తున్న వాహనదారులు, పాదచారులపై పడతాయోనని జనం వణికిపోతున్నారు. అటు చీమకుర్తి నుంచి ఒంగోలు వరకు కర్నూల్ రోడ్డు, ఇటు ఒంగోలు నుంచి రామాయపట్నం వరకు హైవేలో ఈ వాహనాలే బారులు తీరుతున్నాయి. ప్రధానంగా నగరంలో రద్దీ సమయంలో కూడా టిప్పర్లు ఆగడం లేదు.
చీమకుర్తి టు రామాయపట్నం పోర్టు
అతివేగం.. పరిమితికి మించి రవాణా
భారీ టిప్పర్ల రాకపోకలతో ప్రమాదాలమయం
నగరంలో ప్రజా జీవనానికి అడ్డంకి
ఎక్కడికక్కడ గుల్ల అవుతున్న రహదారులు
చేతులెత్తేసిన పోలీసు, రవాణా మైనింగ్ అధికారులు
మామూళ్ల పర్వంతోనే వదిలేస్తున్నారంటూ ఆరోపణలు
నిత్యం ట్రాఫిక్ జాం.. ఇబ్బందిపడుతున్న వాహనదారులు
అతివేగం, పరిమితికి మించి రవాణా, ఎటువంటి రక్షణ లేకపోవడం, నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం.. ఇదీ ప్రస్తుతం చీమకుర్తి టు రామాయపట్నం పోర్టు మధ్య నడుస్తున్న రాళ్ల రవాణా వాహనాల పరిస్థితి. వందల కొద్దీ టిప్పర్లు వేల ట్రిప్పులు నిరంతరం తిరుగుతుండంతో రహదారులు సైతం దెబ్బతింటున్నాయి. లైసైన్సులు లేని డ్రైవర్లు, విశ్రాంతి లేని డ్రైవింగ్‌తో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట రాళ్లు రవాణా చేస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అంతేకాదు ఫిట్‌నెస్ లేని వాహనాలు కావడం తరచూ రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ నిలిచి పోవడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. భారీ రాళ్ల రవాణాతో ప్రధానంగా ఒంగోలు నగరంలో ప్రజాజీవనానికి అడ్డంకిగా మారింది.
ఒంగోలు (క్రైం), మార్చి 2 : చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టుకు వెళ్తున్న రాళ్ల రవాణా వాహనాలు యమడేంజర్‌గా మారాయి. ఆ వాహనం వస్తుందంటేనే జనానికి దడ మొదలవుతోంది. సుమారు 40 నుంచి 50 టన్నుల రాళ్లను ఎటువంటి రక్షణ లేకుండా రవాణా చేస్తున్నారు. దానికితోడు అతివేగం, ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తున్న పరిస్థితి. దీంతో రాళ్లు పక్కన వస్తున్న వాహనదారులు, పాదచారులపై పడతాయోనని జనం వణికిపోతున్నారు. అటు చీమకుర్తి నుంచి ఒంగోలు వరకు కర్నూల్ రోడ్డు, ఇటు ఒంగోలు నుంచి రామాయపట్నం వరకు హైవేలో ఈ వాహనాలే బారులు తీరుతున్నాయి. ప్రధానంగా నగరంలో రద్దీ సమయంలో కూడా టిప్పర్లు ఆగడం లేదు. ఉదయం స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే వారితో రోడ్లు కిక్కిరిసి ఉంటాయి. అలాంటి సమయంలోనూ భారీ వాహనాలు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇదేమి తమకు పట్టదన్నట్లుగా అటు పోలీసు, ఇటు రవాణా, మైనింగ్ శాఖల అధికారులు అధికారపార్టీ పలుకుబడికి భయపడి మిన్నకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా మామూళ్లు కూడా పనిచేస్తున్నాయనే తెలుస్తోంది. ఆ వాహనాలకు ఎటువంటి అనుమతులు ఉండటం లేదనే విషయం బహిరంగ రహస్యమే. అంతేకాదు నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా పోలీసు అధికారులు ఆ వాహనాలవైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిర్విరామంగా రాళ్లు తరలిస్తూ ప్రభుత్య ఖజానాకు తూట్లు పొడుస్తున్నా రు. ప్రజాజీవనానికి అడ్డంకిగా మారుస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య
ఒంగోలు నగరంలో నిత్యం రెండు వందలకుపైగా భారీ టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అదే సమయంలో కర్నూల్ రోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా మరలిస్తే ట్రాఫిక్ సమస్యతో పాటుగా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంతేకాకుండా పరిమితికి మించి రాళ్లు రవాణా చేయడం మూలంగా రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంది. రాళ్ల లోడ్ నుంచి వచ్చే దుమ్ము ధూళితో ఆయా రోడ్డుమార్గంలో ఉంటున్న ప్రజలకు రోగాలు వచ్చే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా రాత్రిళ్లు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వాలని, అది కూడా కర్నూల్ రోడ్డు నుంచి నేరుగా హైవేకి వెళ్లేలా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
అనేక ప్రమాదాలు..
గత ఏడాది డిసెంబరు 26న చీమకుర్తి బైసాస్ రోడ్డు వద్ద రాళ్ల లోడు వాహనం ఎదురు గా వచ్చిన మరో టిప్పర్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్ అయిన కర్నూలు జిల్లా వాసి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో టిప్పరు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఫ ఈ ఏడాది జనవరి 21న సింగరాయకొండ మండలం కనుమళ్ళ వద్ద టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో మరో వైపునకు వాహనం పల్టీకొట్టి రాళ్లు అన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఆసమయంలో ఎదురుగా ఎటువంటి వాహనం రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు వణికిపోయారు.
ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్‌లో ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో మోటార్ సైకిలిస్టుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి ట్రాఫిక్ పోలీసులు చేతులు దులుపుకొన్నారు.
నిత్యం రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ టిప్పర్లు మరమ్మతులు, ఇతర అవసరాల కోసం డ్రైవర్లు నిలిపేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.
గత రెండు రోజులుగా ఉదయం సమయంలో వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో ఒంగోలులోని పాత బైపాస్ రోడ్డు నుంచి కర్నూలు రోడ్డు వరకు ట్రాఫిక్ జాం అవుతోంది. రామాయపట్నంలో రాళ్లు అన్‌లోడ్ చేసి తిరిగి చీమకుర్తి వెళ్లే వాహనాలు బారులు తీరుతున్నాయి. అలాగే అదే సమయంలో చీమకుర్తి నుంచి రాళ్ల లోడ్‌తో వచ్చే వాహనాల హడావుడి నెలకొంది. దీంతో ట్రాఫిక్ గంటలకుపైగా నిలిచిపోయింది. ఆ సమయంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, నగరంలో పనుల కోసం వచ్చే కూలీలు ఇబ్బందిపడుతున్నారు.