అడిగే వారెవరు?
ABN , First Publish Date - 2023-11-21T23:18:41+05:30 IST
టంగుటూరు మండలంలోని పొందూరులో సైడు కాలువకు వైసీపీ నాయకుడు అడ్డుకట్ట వేశాడు. దీంతో కాలువ పొర్లి ఆమార్గంలోని గృహాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి మురుగు నీరు చేరింది. విషయం తెలుసుకున్న అధికారులు కట్టను తొలగించాలని కోరినా వైసీపీ నాయకుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పొందూరు ఎస్సీ కాలనీలో సైడు కాలువకు అడ్డుకట్టలు
వైసీపీ నేత నిర్వాకం
ఇళ్లలోకి, పాఠశాలలోకి చేరిన మురుగు
పొందూరు (టంగుటూరు), నవంబరు 21 : మండలంలోని పొందూరులో సైడు కాలువకు వైసీపీ నాయకుడు అడ్డుకట్ట వేశాడు. దీంతో కాలువ పొర్లి ఆమార్గంలోని గృహాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి మురుగు నీరు చేరింది. విషయం తెలుసుకున్న అధికారులు కట్టను తొలగించాలని కోరినా వైసీపీ నాయకుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పొందూరులోని దళిత కాలనీలోని మురుగు నీరు వెళ్లేందుకు ఊరి వెలుపల వరకూ కాలువ ఉంది. ఇంతకాలం పల్లెలోని మురుగు నీరంతా ఆ కాలువ ద్వారా ఊరి బయట చేల వైపు పారుతోంది. ఓ రైతుకు చెందిన పొలంలో మురుగునీరు చేరడంతో ఆయన మెరక తోలించుకున్నాడు. దీంతో మురుగు నీరు ఆసమీపంలో ఉన్న వైసీపీ నేత అయిన గ్రామ సచివాలయ కన్వీనర్ మోండ్రు హనుమంతరావుకు చెందిన చేలోకి చేరుతోంది. దాన్ని నిలువరించేందుకు ఆయన ఏకంగా సైడు కాలువపై ఇటీవల రెండు చోట్ల అడ్డుకట్టలు వేశారు.
ప్రజలు, విద్యార్థుల అవస్థ
సైడు కాలువపై రెండుచోట్ల వైసీపీ నాయకుడు అడ్డుకట్ట వేయడంతో మురుగు నీరు పొర్లి ఇళ్లలోకి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి చేరింది. మిడసల రాజేష్, మిడసల రామారావు గృహాలలోకి మురుగు నీరు చేరి వారు అవస్థ పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, లోపలికి వెళ్లాలన్నా మురుగు నీటిలోనే నడవాల్సి వస్తున్నదని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య ఎవ్వరికీ పట్టడం లేదని, మురుగు నీరు ఇళ్లలోకి రాకుండా నిలిపే వారే కరువయ్యారని వాపోయారు. అదేదారిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మురుగు నీరంతా పాఠశాలలో చేరి విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు మంగళవారం పాఠశాలను పంచాయతీ కార్యదర్శి పద్మావతి సందర్శించారు. హనుమంతరావుతోపాటు, ఇతర వైసీపీ నాయకులతో మాట్లాడారు. అయినప్పటికీ కాలువకు అడ్డంగా వేసిన కట్టలను తొలగించేందుకు హనుమంతరావు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఆమె పాఠశాల గేటు వద్ద కాస్త మెరక తోలించి మమ అనిపించారు. పాఠశాల లోపల మురుగు నీరంతా అలాగే నిలిచి ఉంది. దీంతో విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతమయ్యాయి.