Share News

ఆరని మంటలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:02 AM

అధికార వైసీపీలో ప్రారంభమైన అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ సెగ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డిని కూడా తాకింది.

ఆరని మంటలు
హైదరాబాద్‌లో విజయసాయిరెడ్డిని కలిసి ఎమ్మెల్యే బుర్రాపై ఫిర్యాదు చేస్తున్న కనిగిరి వైసీపీ నేతలు

విజయసాయిరెడ్డి వద్ద అసంతృప్తివాదుల పంచాయితీ

మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే సుధాకర్‌పై కస్సుబుస్సు

బుర్రాకు టికెట్‌ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు

నియోజకవర్గాల్లో సర్వేలు.. మార్పులపై పునర్‌పరిశీలన

కోఆర్డినేటర్‌తో బాలినేని ఏకాంత భేటీ

కొండపిపై సురేష్‌ సమీక్ష ప్రారంభం

ఎస్‌ఎన్‌పాడు, అద్దంకి ఇన్‌చార్జిలకు తొలగని సమస్యలు

అధికార వైసీపీలో ప్రారంభమైన అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ సెగ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డిని కూడా తాకింది. శనివారం ఆయన వద్ద కొన్ని నియోజకవర్గాల ద్వితీయశ్రేణి నాయకులు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. కనిగిరి ఎమ్మెల్యేకు టికెట్‌ ఇస్తే తాము పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. వైపాలెం సమస్యపై మంత్రి సురేష్‌కు ఫోన్‌ చేసి సాయిరెడ్డి కస్సుబుస్సుమన్నారు. తనను కలిసిన ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై సెటైర్లు వేశారు. అదేసమయంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనితో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇంకోవైపు ఇన్‌చార్జిల మార్పు జరిగిన చోట అధికారపార్టీ రీసర్వేకు శ్రీకారం పలికింది. తదనుగుణంగా కొందరి నియామకంపై పునర్‌పరిశీలన జరగవచ్చని ఆ పార్టీ అగ్రనాయకుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లా వైసీపీలో ప్రారంభమైన ఇన్‌చార్జిల మార్పు ముసలం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. చివరకు సీఎం జగన్‌ నిర్ణయాన్ని విభేదించేవారు, ఆయా నియోజకవర్గాల అసం తృప్తివాదులు పొలోమని హైదరాబాద్‌ వెళ్లి విజయసాయిరెడ్డి వద్ద సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులైతే తమ అసంతృప్తిని తీవ్రస్థాయిలో వెళ్లగక్కుతున్నారు. ఒకట్రెండు విషయాల్లో అడపాదడపా చూద్దాం.. చేద్దాం అనటమే తప్ప విజయసాయిరెడ్డి ఎలాంటి హామీలు ఇవ్వలేదని తెలిసింది.

బుర్రాకు టికెట్‌ ఇస్తే ఊరుకోం

కనిగిరి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలిపోయిన ముఖ్యనాయకులు ఎమ్మెల్యే బుర్రాకు తిరిగి టికెట్‌ ఇస్తే తాము రాజీనామా ఇస్తామని విజయసాయిరెడ్డికి తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే.. వైసీపీ శ్రేణులకు, నాయకులకు తీవ్ర అన్యాయం చేయటమే కాక ప్రజల్లో కూడా వ్యతిరేకత మూటగట్టుకున్నారని వివరిస్తూ పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బాలినేని సమక్షంలో వారు బుర్రాకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడం విశేషం. విజయసాయిని కలిసిన వారిలో సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి, వెలిగండ్ల జడ్పీటీసీ, జడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కనిగిరి ఎంపీపీ మహాలక్ష్మి, తిరుపతిరెడ్డి, హెచ్‌ఎంపాడు, కనిగిరి జడ్పీటీసీ సభ్యుడు నారాయణయాదవ్‌, కస్తూరిరెడ్డి, మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు కొండారెడ్డి. రామిరెడ్డిలతోపాటు ఇతరత్రా పదవుల్లో ఉన్న 70మంది ఉన్నారు.

సురేష్‌, సుధాకర్‌లపై కస్సుబస్సు

వైపాలెం టికెట్‌ ఆశిస్తున్న చంద్రశేఖర్‌, ఇతర నాయకులు సాయిరెడ్డిని కలిశారు. అక్కడ ఉన్న బాలినేని తాను సీఎంతో మాట్లాడిన తర్వాత వైపాలెం ఇన్‌చార్జిగా చంద్రశేఖర్‌ పేరును ప్రకటించా లని చెప్పినా స్పందన లేదని చెప్పారు. వెంటనే చంద్రశేఖర్‌, ఇతర ఆయన మద్దతుదారులు ఈ విషయంలో మంత్రి సురేష్‌ అడ్డుకుంటున్నారని.. ఆయన పంథా మార్చుకోకపోతే కొండపిలో ఎలా గెలుస్తారో చూస్తామంటూ సాయిరెడ్డికి తెలిపారు. వెంటనే ఆయన సురేష్‌కు ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి ‘ఏంది ఇలా చేస్తున్నావు. చంద్రశేఖర్‌ను ఎందుకు పక్కన పెట్టావు’ అని అడిగినట్లు తెలిసింది. సురేష్‌ స్పందిస్తూ సీఎం జగనే గుంటూరు జడ్పీ చైర్మన్‌ క్రిస్టినాను వైపాలెం వెళ్లాలని చెప్పారని తెలిసిందని, అందుకే తాను సైలెంట్‌ అయ్యానని అన్నట్లు సమాచారం. వెంటనే సాయి రెడ్డి చిరాగ్గా.. ‘సీఎం నీకు చెప్పారా? నేనూ చెప్పలేదుగా! ఏమిటి ఇదంతా? సీఎం వద్దే మాట్లాడు కుందాం. అక్కడే తేల్చుకుందాం’ అని కస్సుబుస్సు లాడినట్లు తెలిసింది. ఇదేసమయంలో ఎస్‌ఎన్‌ పాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కూడా సాయిరెడ్డిని కలిశారు. ‘పార్టీ పంథా బాగాలేదు. జిల్లాలో బాలినేని సహకరించకపోతే మొత్తం కొట్టుకుపోతుంది.. మీ ఇష్టం’ అంటూ కాస్తంత ఆవేశంగా అన్నట్లు తెలిసింది. వెంటనే సాయిరెడ్డి స్పందిస్తూ నిజమే సుధాకర్‌ మీరు నిన్నటి దాకా ఎవరితో తిరిగి వచ్చారు... అంటూ హేళనగా మాట్లాడినట్లు తెలిసింది. మరోవైపు విజయసాయిరెడ్డితో బాలినేని ఏకాంతంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

రీసర్వేలు, పునఃపరిశీలన

ఇంకోవైపు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చుతూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ అధిష్ఠానం సర్వేలు ప్రారంభించింది. ఐప్యాక్‌ ప్రతినిధులతోపాటు సొంత మీడియా ప్రతినిధులు, మరో ప్రైవేట్‌ సంస్థతో సర్వేలు చేయిస్తున్నారు. వైపాలెం కొత్త ఇన్‌చార్జి ఎంపికపైన.. అద్దంకి, ఎస్‌ఎన్‌పాడులో కొత్త ఇన్‌చార్జిల నియామకాలపై సర్వేలు చేశారు. కొండపి మినహా అన్ని ప్రాంతాల్లో రీసర్వేలు జరుగుతున్నాయి. ఎక్కువచోట్ల సీఎం నిర్ణయంపై పార్టీశ్రేణుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వస్తున్నట్లు తెలిసింది. దీంతో పరిస్థితులను సమీక్షించి అవసరమైన చోట మార్పు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

కొండపిపై సురేష్‌ సమీక్ష

కొండపి ఇన్‌చార్జి బాధ్యతను చేపట్టినట్లుగా మంత్రి సురేష్‌ సంకేతాలిచ్చారు. శనివారం ఒంగోలులోని క్యాంపు కార్యాల యంలో ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న ముఖ్యమైన అధికా రులను పిలిపించుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు అక్కడ పార్టీ, ప్రజాభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్‌ఎన్‌పాడు, అద్దంకి ఇన్‌ చార్జిలుగా నియమితులైన నాగార్జున, హనిమిరెడ్డిలు ఆ నియోజకవర్గాల పాత ఇన్‌చార్జులను ఇంతవరకూ కలవలేదు. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు గత నాలుగు రోజులుగా నియోజకవ ర్గంలో లేరు. హనిమిరెడ్డి.. వైవీ కుటుం బసభ్యులను, చీరాల ఎమ్మెల్యే బల రాంను కలిశారే తప్ప కృష్ణచైతన్యను ఇంతవరకు కలవలేదు. ఆదివారం సింగరకొండలో పూజలు చేసి అద్దంకి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఆయన ఇన్‌చార్జిగా బాధ్యతలు ప్రారంభించన న్నట్లు చెబుతున్నారు

Updated Date - Dec 17 , 2023 | 01:02 AM