పదో తరగతి విద్యార్థులకు ‘టాప్’
ABN , First Publish Date - 2023-03-01T01:22:54+05:30 IST
ఏప్రిల్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో మార్కులు సాధించేందుకు ప్రత్యేకంగా టార్గెట్ ఓరియంటెడ్ ప్రోగ్రాం (టాప్)ను విద్యాశాఖ అమలు చేస్తోంది.
ఎఫ్‌ఏ-4 పరీక్ష రద్దు
8 నుంచి 16 వరకు ప్రీఫైనల్
ఒంగోలు(విద్య), ఫిబ్రవరి 28 : ఏప్రిల్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో మార్కులు సాధించేందుకు ప్రత్యేకంగా టార్గెట్ ఓరియంటెడ్ ప్రోగ్రాం (టాప్)ను విద్యాశాఖ అమలు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా ఈ టాప్‌ను రూపొందించారు. విద్యార్థుల్లో ఆందోళనను పోగొట్టేందుకు వారికి మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. వాటిల్లో వారు చేసిన తప్పులను గుర్తించి తరగతి గదిలో వివరిస్తారు. మళ్లీ పరీక్షల్లో ఆ తప్పులు పునరావృతం కాకుండా చూడటం ప్రధాన లక్ష్యం. అందుకోసం పదో తరగతి విద్యార్థులకు టైం టేబుల్‌లో కూడా మార్పులు చేశారు. ఆయా సబ్జెక్టులు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్‌లో కవర్ అయ్యేలా ప్రణాళికను రూపొందించారు. ప్రతిరోజూ ఉదయం 8.30 ఉంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యార్థులకు పీరియడ్లు కేటాయించారు.
ప్రతిరోజూ పరీక్షలే
టాప్ విధానంలో విద్యార్థులకు ప్రతిరోజూ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండు లాంగ్ పీరియడ్లలో మొదటి 45నిమిషాలు పరీక్షకు సన్నద్ధం చేసి రెండో 45 నిమిషాలలో పరీక్ష నిర్వహిస్తారు. వీటి కోసం విద్యార్థులు ప్రత్యేకంగా నోట్ బుక్‌లు పెట్టి పరీక్షలను వాటిల్లోనే రాయాలి. సంబంధిత సబ్జెక్టు టీచర్లు ఆ సమాధానాలను మూల్యాంకనం చేసి విద్యార్థులు చేసిన తప్పులను గుర్తిస్తారు. వాటిని వివరించి అవి పునరావృతం కాకుండా చూస్తారు.
నెలాఖరు వరకూ కొనసాగనున్న కార్యక్రమం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు ఉండవు. పబ్లిక్ పరీక్షలకు కసరత్తుగా ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రీ ఫైనల్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష విద్యార్థులకు పబ్లిక్ తరహాలో మొత్తం సిలబస్‌పై ఉంటుంది. టాప్ కార్యక్రమం మార్చి 31 వరకు కొనసాగుతుంది.