Share News

అటవీ భూముల్లో కర్రదొంగలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:57 AM

అటవీ భూముల్లో కలప దొంగలు పడ్డారు. బయటి వారి వరకు ఎందుకని ఇంటిదొంగలే గుట్టుగా విలువైన కర్రను తరలించేస్తున్నారు.

అటవీ భూముల్లో కర్రదొంగలు
కుప్పలుగా పోసి ఉన్న జామాయిల్‌ దుంగలు

సిబ్బందే సూత్రధారులు

కలపను అమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం

కొనకనమిట్ల, డిసెంబరు 16 : అటవీ భూముల్లో కలప దొంగలు పడ్డారు. బయటి వారి వరకు ఎందుకని ఇంటిదొంగలే గుట్టుగా విలువైన కర్రను తరలించేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తోసిరాజని ఇప్పటివరకు 50 ఎకరాల్లో జామాయిల్‌, ఇతర కట్టెలను అడవి దాటించేశారు. దాని విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చినారికట్ల జంక్షన్‌ సమీపంలో 200 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిలో ఇరవై ఏళ్ల క్రితం అధికారులు జామాయిల్‌ మొక్కలను నాటారు. ప్రస్తుతం ఆ చెట్లు కొంతమేర ఎండిపోయాయి. మరికొన్ని మానులుగా మారాయి. ఇలాంటి వాటిని గుట్టుగా అధికారులే అడవిని దాటించేస్తున్నారు. అనంతరం కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు గుట్టుచప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 50 ఎకరాలలో రూ.కోటి విలువైన కలపను ట్రాక్టర్లకు ఎక్కించి యథేచ్ఛగా ఇప్పటికే బయట విక్రయించినట్లు సమాచారం. అలాగే ఈ భూమిని చదును చేసి తిరిగి మొక్కలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు జిల్లాస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు బేఖాతరు

నిబంధనల ప్రకారం అటవీ భూముల్లో కలపను విక్రయించే సమయంలో ముందుగా అధికారులు టెండర్లు పిలవాలి. కలపను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేయాలి. అయితే ఇక్కడ అలాంటి నిబంధనలు ఏమీ అమలు చేయలేదు. పూర్తిగా అనధికారికంగా కలపను నరికి విక్రయిస్తున్నారు. ఈ అక్రమ తరలింపులో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల అందరి పాత్ర ఉండటంతో ఎవ్వరూ నోరు మొదపడం లేదని తెలుస్తోంది. చివరకు గ్రామస్థులు సమాచారం ఇచ్చినప్పుడు కూడా అధికారులు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలాన్నిస్తోంది. ఏదిఏమైనా ప్రభుత్వ జామాయిల్‌ కర్రను అమ్మిన దొంగలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:57 AM