గనులపై పిడుగు

ABN , First Publish Date - 2023-06-03T00:44:38+05:30 IST

గ్రానైట్‌ పరిశ్రమపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. నెలకు రూ.57.88కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రక్రియకు తెరతీసింది.

గనులపై పిడుగు

ప్రైవేటు వ్యక్తులకు సీనరేజీ వసూలు బాధ్యత

రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యం

ప్రభుత్వం పచ్చజెండా

టెండర్ల ఆహ్వానం

గతనెల 26తో ముగిసిన గడువు

ఎవ్వరూ రాకపోవడంతో మరో నెల పొడిగింపు

సొంత వారికి లబ్ధి చేకూర్చేందుకేనన్న ఆరోపణలు

ఆందోళన వ్యక్తంచేస్తున్న గ్రానైట్‌ క్వారీల యజమానులు

ఇప్పటికే సంక్షోభంలో పరిశ్రమ

గ్రానైట్‌ పరిశ్రమపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. నెలకు రూ.57.88కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రక్రియకు తెరతీసింది. గ్రానైట్‌తోపాటు పలకలు, తెల్లరాయి తదితర భూగర్భ గనులన్నింటికీ సంబంధించి సీనరేజీ వసూలుకు ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించింది. తొలుత ప్రకటించిన టెండర్‌ గడువు గతనెల 26తో ముగిసింది. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మరో నెల పొడిగించింది. ఈ విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చాలన్న మర్మం దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పరిశ్రమ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం ఇవ్వడం సరికాదని వారు అంటున్నారు. ఇలాంటి అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలు పరిశ్రమ మనుగడపైనే ప్రభావం చూపుతాయని వాపోతున్నారు.

ఒంగోలు (క్రైం), జూన్‌ 2 : జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమ ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, కరోనా అనంతరం ఎగుమతులు మందగించడం, వివిధ దేశాల్లో కొత్త విధానాల అమలుతో ఇప్పటికే పరిశ్రమ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విధానాలు కూడా అందుకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీనరేజీ వసూలు బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్వారీ యజమానులకు శరాఘాతంలా మారనుంది.

గ్రానైట్‌ పరిశ్రమపై తీవ్రప్రభావం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గెలాక్సీ, బ్లాక్‌, కలర్‌ గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. చీమకుర్తి గెలాక్సీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో బ్లాక్‌ పెరల్‌ క్వారీలు ఉన్నాయి. మార్కాపురంలో పలకలతోపాటు కనిగిరి ప్రాంతంలో వైట్‌ క్వార్ట్జ్‌, రోడ్డుమెటల్‌ నిక్షేపాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది గ్రానైట్‌ పరిశ్రమ. చీమకుర్తి ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్‌ క్వారీలు 100 వరకూ నడుస్తున్నాయి. మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో గ్రానైట్‌.. కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో పలకలు, ఇతరత్రా భూగర్భగనులకు సంబంధించి 50కు పైగా క్వారీలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ వీటికి మైనింగ్‌ శాఖ వారు పర్మిట్లు ఇచ్చేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఆ బాధ్యత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. వారు ఇష్టమైన వారికే పర్మిట్లు మంజూరు చేసే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా గెలాక్సీ గ్రానైట్‌, బ్లాక్‌ పెరల్‌ లాంటి రాళ్లకు పర్మిట్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి పొందడం గగనంగా మారనుంది.

ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రానైట్‌ ద్వారా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేసింది. జిల్లాలో ఉన్న గ్రానైట్‌ క్వారీల లీజుల ద్వారా గతంలో ఏడాదికి రూ.500 కోట్ల వరకూ ఆదాయం సమకూరేది. దాన్ని పెంచుకునేందుకు రాయల్టీ వసూలును క్యూబిక్‌ మీటర్‌ నుంచి టన్నేజీకి మార్చింది. ఈ విధానం ప్రకారం పనికి రాని రాయిని కూడా రాయల్టీ చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంది. దీనిపై గ్రానైట్‌ క్వారీల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో ఎగుమతులు మందగించాయి. ఈ కారణాలతో క్వారీయింగ్‌ సక్రమంగా జరగడం లేదు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఈ నేపథ్యంలో అటు ఖజానాకు ఆదాయం పెంచుకోవడం కోసం సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. టెండరు దక్కించుకున్న వారు సీనరేజీ వసూలు చేసి నెలకు రూ.57.88 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. వారు రెండు నెలలు అడ్వాన్స్‌ ముందుగానే చెల్లించాల్సి ఉంది.

రంగంలోకి ప్రైవేటు సైన్యం

రాయల్టీ వసూళ్లకు ఇక ప్రైవేటు సైన్యం రంగంలోకి దిగనుంది. టెండర్లు దక్కించుకున్న వారు సుమారు 500 మంది వరకూ ప్రైవేటు వ్యక్తులను గ్రానైట్‌ రాయల్టీ వసూళ్ల కోసం వినియోగించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ కనుసన్నలలో జరిగిన మైనింగ్‌ అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. మైనింగ్‌ శాఖ ప్రేక్షకపాత్ర వహించనుంది. దీంతో అనేక అవకతవకలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-06-03T00:44:38+05:30 IST