ఇదేం పోలీసింగ్‌!

ABN , First Publish Date - 2023-06-07T01:26:58+05:30 IST

టంగుటూరు పంచాయతీ పరిధి రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ హత్య కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.

ఇదేం పోలీసింగ్‌!
రిమ్స్‌ వద్ద బైటాయించి నిరసన తెలుపుతున్న హనుమాయమ్మ బంధువులు (ఇన్‌సెట్‌లో) న్యాయం చేయాలని ఒంగోలు ఆర్డీవో కాళ్లమీద పడిన హనుమాయమ్మ కుమార్తె మాధురి

హనుమాయమ్మ హత్య కేసులో ఉదాసీనత

నిందితుల కోసం గాలింపు చర్యలు శూన్యం

ఘటన అనంతరం వారు చాలాసేపు గ్రామంలో ఉన్నా పట్టించుకోని వైనం

అధికారపార్టీ నేతల ఒత్తిళ్లే కారణమన్న ఆరోపణలు

న్యాయం కోసం బాధిత కుటుంబం రిమ్స్‌ వద్ద ఆందోళన

పోలీసుల తీరుతో జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

రోజంతా బంధువులు, గ్రామస్థుల పడిగాపులు

కలెక్టర్‌ ఆదేశాలతో రాత్రివేళ పోస్టుమార్టం పూర్తి

టంగుటూరు పంచాయతీ పరిధి రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ హత్య కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నిందితుడితోపాటు అతనికి అండగా నిలిచిన వారంతా అధికారపార్టీకి చెందిన వారు కావడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి మంగళవారం సాయంత్రానికి 32 గంటలు గడిచినా వారిని అరెస్టు చేయడం అటుంచి కనీసం గాలింపు చర్యలు కూడా చేపట్టకపోవడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. హనుమాయమ్మ హత్యను నిరసిస్తూ ఇటు అంగన్‌వాడీ కార్యకర్తలు, అటు టీడీపీతోపాటు వివిధ రాజకీయ, ప్రజాసంఘాలు మంగళవారం జిల్లాలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించాయి. కాగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి వీల్లేదని రిమ్స్‌ వద్ద బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు నిరసనకు దిగారు. అక్కడ పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుమార్తె మాధురి చివరకు ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ కాళ్లు పట్టుకోవడం అందరినీ కదిలించింది.

టంగుటూరు/ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 6 : అంగన్‌వాడీ కార్యకర్త, టీడీపీ నేత భార్య అయిన హనుమాయమ్మను వైసీపీ నాయకుడు సవలం కొండలరావు ట్రాక్టర్‌తో తొక్కించి, కాళ్లతో తన్ని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని మృతురాలి కుమార్తె స్వయంగా చెబుతున్నారు. హత్యలో మరికొందరి ప్రమేయం కూడా ఉంది. రావివారిపాలెంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. హనుమాయమ్మను ఒకటికి రెండుసార్లు కొండలరావు ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఆమె కొనఊపిరితో ఉండగా అతనితోపాటు, ఆయన కుటుంబ సభ్యులు కాళ్లూచేతులతో కొట్టారు. సంఘటన చూసి అక్కడికి చేరుకొన్న హనుమాయమ్మ కుమార్తె మాధురిపైనా దాడిచేసి గాయపర్చారు. ఈ దాష్టీకం అంతా జనం చూస్తుండగానే జరిగింది. కానీ పోలీసుల్లో మాత్రం చలనం కరువైంది. ఈ ఘటనలో సవలం కొండలరావుతోపాటు అతని సోదరుడు మహే్‌ష్‌బాబు, వారి కుటుంబ సభ్యులు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి మమ అనిపించారు. నిందితుల అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కించారు. వారు పరారయ్యేందుకు పరోక్షంగా సహకరించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొండలరావు సంఘటన అనంతరం ఊరి వెలుపల మామిడితోటలో చాలాసేపు ఉన్నారు. ఆతర్వాతే మిత్రుల సాయంతో కారులో పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు ముందుగా అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులను తీసుకొచ్చి విచారిస్తే ఆయన దొరికేవారు. కానీ అలా చేయకపోవడంతో హత్యోదంతంలో ప్రమేయం ఉన్న వారు కూడా కొంత సమయం గ్రామంలోనే ఉండి మెల్లగా ఊరుదాటి వెళ్లినట్లు తెలిసింది.

నిందితులు అధికార పార్టీవారైనందునే!

నిందితుల కుటుంబం అధికార పార్టీకి చెందినది కావడం, వారికి వైసీపీ ముఖ్యనేతల మద్దతు మెండుగా ఉండటంతో పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విషయంలోనే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మామూలు సంఘటనల్లో వీరి వ్యవహారం ఎలా ఉంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. హనుమాయమ్మ హత్యను నిరసిస్తూ తెలుగుదేశంతోపాటు వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు టంగుటూరులో ర్యాలీ నిర్వహించారు. హంతకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని, బాఽధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.

ఇంత దారుణమా?

హనుమాయమ్మ మృతదేహాన్ని సోమవారం రిమ్స్‌కు తరలించి మార్చురీలో ఉంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మృతురాలి భర్త సుధాకర్‌తోపాటు కుమార్తె మాధురి, రావివారిపాలెం గ్రామస్థులు ఒంగోలు రిమ్స్‌ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసేవరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. మహిళ అనికూడా చూడకుండా పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి, చంపడం ఇంకా తమ కళ్ల ముందు మెదలాడుతుందన్నారు. అయితే ఏఒక్క అధికారి కూడా వారిని ఓదార్చేందుకు రాకపోవడంపై మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రభుత్వ శాఖలో సేవలందించిన హనుమాయమ్మకు కనీస నివాళి కూడా కరువైందన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా స్పందించకపోవడంతో వందలాదిమంది రావివారిపాలెం గ్రామస్థులు, హనుమాయమ్మ బంధువులు, కుటుంబసభ్యులు రోజంతా మండుటెండలో ఉన్నారు.

రిమ్స్‌ వద్ద ఉద్రిక్తత

రిమ్స్‌కు వచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, ఎమ్మెల్యే స్వామి మొదట హనుమాయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో కలిసి రిమ్స్‌ ఎదుట భారీ ఆందోళనకు సిద్ధమవుతున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన జరగకుండా పోలీసులు ముందుగానే రెండు గేట్లు మూసివేశారు. అక్కడకు వచ్చిన వారిని బలవంతంగా తోసేశారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఆందోళనతో ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ అక్కడకు చేరుకున్నారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ మాధురి ఆర్డీవో కాళ్లు పట్టుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, మానవతాదృక్పథంతో ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అయితే హామీలపై స్పష్టత వచ్చేవరకు పోస్టుమార్టం జరగడానికి వీలులేదని మృతురాలి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. కాగా కలెక్టర్‌ ఆదేశాలతో రాత్రి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీస్‌ మార్కు రివర్స్‌ కేసులు

కొండపి ఎమ్మెల్యే స్వామిపై దాడి లక్ష్యంగా ఆయన ఇంటిముట్టడికి వైసీపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నెలకొన్న ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అవి రెండూ టీడీపీ నేతలపైనే బనాయించారు. ఈమేరకు టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా తెలిపారు. ఏమి కేసులు, ఏఏ సెక్షన్ల కింద పెట్టారన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఎమ్మెల్యే స్వామిపైకి వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పడంతోపాటు, పోలీసుల గృహ నిర్భంధం నుంచి తప్పించుకొని ఎమ్మెల్యే ఇంటిపైకి కేడర్‌తో కలిసి దండయాత్రకు కదిలిన వైసీపీ ఇన్‌చార్జి అశోక్‌బాబుపై మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిసింది. అధికారపార్టీకి ఒక న్యాయం, విపక్షానికి ఒక న్యాయమా అని ప్రజలు విమర్శిస్తున్నారు. పోలీసులు కేవలం టీడీపీ నాయకులపైనే కేసులు పెడితే పోరాడాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-06-07T01:26:58+05:30 IST