పశ్చిమప్రాంతం అతలాకుతలం

ABN , First Publish Date - 2023-03-26T00:51:53+05:30 IST

జిల్లాలోని పశ్చిమప్రాంతంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, ఆపై వర్షంతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది.

పశ్చిమప్రాంతం అతలాకుతలం

మధ్యాహ్నం వరకు మండిన ఎండ

సాయంత్రం గాలులు, మోస్తరు వర్షం

విరిగిపడిన చెట్లు, నేలకొరిగిన స్తంభాలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పలుచోట్ల తడిసిన మిర్చి

ఒంగోలు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పశ్చిమప్రాంతంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, ఆపై వర్షంతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న మిర్చితోపాటు ఇతర పంటలు తడిసిపోయాయి. జిల్లాలో గత వారంరోజులుగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షపుజల్లులు పడుతూనే ఉన్నాయి. అక్కడక్కడా ఒక మోస్తరు వర్షంతో కొంత మేర పంటలకు నష్టం కూడా వాటిల్లింది. ఈక్రమంలో శనివారం పశ్చిమ ప్రాంతంలో ఒకే రోజు ఎండల తీవ్రత, ఈదురుగాలులు, వర్షంతో జనం తల్లడిల్లిపోయారు. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. మధ్యాహ్నానికి బాగా పెరిగింది. ప్రత్యేకించి పశ్చిమప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో 38 నుంచి 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం ఐదు గంటలకు హెచ్‌ఎంపాడు మండలం వేములపాడులో 39.29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

తడిసిపోయిన మిర్చి

ఒకవైపు ఎండలతో బెంబేలెత్తిపోయిన ఆ ప్రాంత ప్రజలకు సాయంత్రం ఈదురుగాలులు, వర్షం మరింత ఆందోళన కలిగించాయి. కంభం, బేస్తవారపేట, మార్కాపురం, దొనకొండ, అర్ధవీడు, కనిగిరి, కేకేమిట్ల, వైపాలెం, పెద్దారవీడు, దర్శి, కురిచేడు, హెచ్‌ఎంపాడు తదితర మండలాల్లో గాలులతో కూడిన జల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండగా ఒక మోస్తరు వర్షం పడింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి అర్ధవీడు మండలం నాగులవరంలో 48.75మి.మీ వర్షం కురిసింది. దొనకొండ మండలంలో 28.25, బీపేట మండలంలో 26.25, హెచ్‌ఎంపాడు మండలంలో 20.75, మార్కాపురం మండలంలో 18.25, కేకేమిట్ల మండలంలో 18.0, కనిగిరిలో 15.0మి.మీ వర్షపాతం నమోదైంది. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో పలు గ్రామాల్లో రోడ్ల వెంట ఉండే చెట్లు విరిగిపడగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరి గాయి. దీంతో గంటల తరబడి ఆయా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొన్ని గ్రామాల్లో కోసి కల్లాల్లో ఆరబెట్టి ఉన్న మిర్చి అంతా తడిసిపోయింది. గాలుల తీవ్రతతో మిర్చి కల్లాలపై కప్పిన టార్పాలిన్‌ పట్టలు కూడా లేచిపోవడంతో కాయలు తడిసి రైతులు నష్టపోయారు. కొన్నిచోట్ల వరి ఓదెలు నీట మునిగాయి.

Updated Date - 2023-03-26T00:51:53+05:30 IST