Share News

వేలం కేంద్రాల్లోనే పండుగుల్ల విక్రయాలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:54 PM

గత ఏడాది వలే రానున్న సీజన్‌లో కూడా పండుగుల్ల, బిట్స్‌ను వేలం కేంద్రాల్లోనే కొనుగోలు చేస్తామని పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో తనను కలిసిన దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల ప్రతినిధులకు స్పష్టమైన హామీ ఇచ్చారు

వేలం కేంద్రాల్లోనే పండుగుల్ల విక్రయాలు
రైతు ప్రతినిధులతో మాట్లాడుతున్న ఈడీ శ్రీధర్‌బాబు

రైతు ప్రతినిధులకు పొగాకు బోర్డు ఈడీ హామీ

పొగతోటలను పరిశీలించిన చైర్మన్‌

ఒంగోలు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : గత ఏడాది వలే రానున్న సీజన్‌లో కూడా పండుగుల్ల, బిట్స్‌ను వేలం కేంద్రాల్లోనే కొనుగోలు చేస్తామని పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆ మేరకు మంగళవారం సాయంత్రం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో తనను కలిసిన దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల ప్రతినిధులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ఏడాది పండుగుల్ల, బిట్స్‌ను వేలం కేంద్రాల్లో కొనుగోలు చేయడం వల్ల రైతులకు మెరుగైన ధరలు లభించాయి. పొగాకు బోర్డుకు ఆదాయం కూడా వచ్చింది. గతంలో వలే గ్రామాలలో రైతులకు స్థానికంగా అనధికారికంగా ఆకు రెలుపు చేసుకొని వెళ్ళే వారికి మధ్య ఘర్షణపూరిత వాతావరణం లేకుండా పోయింది. గత సీజన్‌లో ఈ విధానాన్ని ప్రయోగత్మాకంగా అమలు చేయగా ఈ ఏడాది కూడా వేలం కేంద్రాల్లోనే కొనాలన్న డిమాండ్‌ గత సీజన్‌ వేలం ముగింపు సమయంలో రైతులు ముందుకు తెచ్చారు. కాగా ప్రస్తుత సీజన్‌ పొగాకు పంట కొన్ని చోట్ల మూడు, నాలుగు విడతల రెలుపు పూర్తయింది. అక్కడక్కడ అనధికారికంగా గ్రామాల్లో కొందరు పండుగుల్ల పేరుతో రెలుపు చేస్తున్నారు. దీంతో దానిని అరికట్టే చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు అధికారులను కోరారు. ఈ విషయమై మంగళవారం ఒంగోలులోని ఆర్‌ఎం కారర్యాలయంలో దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు సమావేశమై చర్చించారు. సాయంత్రం గుంటూరు వెళ్ళి ఈడీ శ్రీధర్‌బాబు, కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిసి చర్చించగా ఈడీ సానుకూలంగా స్పందించారు. తక్షణ చర్యలకు స్థానిక బోర్డు అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బోర్డు సభ్యులు బ్రహ్మయ్య, పొద ప్రసాదరావు, సుబ్బారెడ్డి, వివిధ వేలం కేంద్రాల ప్రతినిధులు వడ్డెళ్ళ వరప్రసాద్‌, శివారెడ్డి, ఆళ్ళ సుబ్బారావు, మహేష్‌, రమణయ్య, పోతుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా పొగాకు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌ జిల్లాలో పర్యటించారు. వెల్లంపల్లి, ఒంగోలు-1,2 టంగుటూరు వేలం కేంద్రాల పరిధిలోని పలు గ్రామాల్లో పొగాకు తోటలను పరిశీలించారు. ఇక్కడి ఆర్‌ఎం కార్యాలయంలో రైతు ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:54 PM